Telangana Assembly: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల టీషర్టులపై అభ్యంతరం
BRS MLAs and MLCs Protest at Telangana Assembly Gate: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతకర టీషర్టులు ధరించి అసెంబ్లీ లోపలికి వచ్చేందుకు యత్నించారు. దీంతో అసెంబ్లీ దగ్గర సిబ్బంది బీఆర్ఎస్ నేతలను అడ్డుకొని అనుమతించడం లేదు. అయితే బీఆర్ఎస్ నేతలు అదానీ, రేవంత్ బొమ్మలతో టీషర్టులు వేసుకొని అసెంబ్లీకి వచ్చారు. ఇందులో రేవంత్, అదానీ దోస్తానా అంటూ టీషర్టులు ఉండడంతో సిబ్బంది అడ్డుకున్నారు.
అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధరించిన ఈ టీషర్టులపై అసెంబ్లీ సెక్యూరిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. టీషర్టులతో అనుమతించమని, అక్కడే గేటు దగ్గర నిలిపివేసింది. దీంతో అసెంబ్లీ గేటు దగ్గర బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అంతకుముందు గన్‌పార్కు వద్ద నివాళులర్పించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఎట్టిపరిస్థితుల్లోనూ తమను లోపలికి అనుమతించాలని డిమాండ్ చేయడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్, కవిత తో ఇతరులు గేటు వద్ద నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. రేవంత్, ఆదానీ బాయ్.. బాయ్.. అని, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ చేస్తున్నారని విమర్శలు చేశారు. శాంతియుతంగా నిరసన చేయాలనుకుంటే గేటు బయట తెలపాలని, టీషర్టులతో మాత్రం లోపలికి అనుమతించమని పోలీసులు తేల్చి చెప్పారు.
ఇదిలా ఉండగా, అసెంబ్లీలో పోరా టం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. అసెంబ్లీలో ప్రభుత్వ తీరును ఎండగడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపంపై నిరసన తెలుపుతామని, అదానీ, రేవంత్ దోస్తీపై నిలదీస్తామన్నారు. అలాగే లగచర్ల ఘటనపై ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తామని, మూసీ, హైడ్రాపై బీఎస్‌ఈలో నిలదీస్తామని కేటీఆర్ చెప్పారు.
లగచర్లలో దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారని, నెరవేరని గ్యారంటీలు.. ఇచ్చిన 420ల హామీలు.. వీటన్నింటినీ తుంగలో తొక్కారని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యంగా తెలంగాణ అస్థిత్వంపై జరుగుతున్న దాడి బాధాకరమన్నారు. అయితే తెలంగాణ తల్లినే మారుస్తానన్న రేవంత్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనను కూడా నిరసిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ తరఫున ప్రజల ఆలోచనను వినిపిస్తామన్నారు.