MP Raghunandan Rao : రేవంత్ సర్కారుకు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు : ఎంపీ రఘునందన్‌రావు

MP Raghunandan Rao : కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్వాగతించారు. ఈ నెల 16 వరకు ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కారు మూడు రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లు నరికివేయడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసిందని, ఇది కాంగ్రెస్ సర్కారు తీరుకు నిదర్శనమని మండిపడ్డారు. 1973లో హెచ్‌సీయూ పెట్టినప్పుడు 2,374 ఎకరాలను అప్పటి కాంగ్రెస్ సర్కారు ఇచ్చిందని, ఇప్పుడు అదే కాంగ్రెస్ ఆ భూములను లాక్కుంటుందని మండిపడ్డారు.
విద్యార్థులు సాధించిన సమైక్య విజయం..
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు విద్యార్థులు సాధించిన సమైక్య విజయం అన్నారు. విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలిపినప్పుడు పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారని మండిపడ్డారు. యూనివర్సిటీలో పిల్లల జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు రాహుల్ గాంధీకి ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు. మా నానమ్మ ఇచ్చిన భూములను ఎందుకు లాక్కుంటున్నావని రాహుల్ అడిగారా?. రాహుల్ అడిగి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదన్నారు. కోర్టులో ఉన్న అంశంపై ఇంతకంటే ఎక్కువ మాట్లాడటం సరికాదన్నారు. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు విద్యార్థులకు అనుకూలమని, వారి విజయానికి నిదర్శనమని చెప్పారు. భవిష్యత్‌లో విద్యార్థుల భూములు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు. వాల్టా చట్టం ప్రకారం ఇంటి కాంపౌండ్‌లో ఉన్న చెట్టు నరకాలన్నా అనుమతులు తప్పనిసరి అన్నారు.
నిపుణుల కమిటీ వేయాలి..
ఒక్క చెట్టుకే అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితుల్లో మూడు రోజుల్లో 100 ఎకరాల్లో వేల కొద్దీ చెట్లను నరికివేయడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసిందన్నారు. చట్టాలు, నిబంధనలు అధికారులకు తెలియదని తాను అనుకోవడం లేదని చెప్పారు. సుప్రీం ఆదేశాల ప్రకారం నెల రోజుల్లో నిపుణుల కమిటీ వేయాలని కోరారు. విద్యార్థుల పక్షాన నిలబడతామని స్పష్టం చేశారు. విద్యార్థుల పోరాటాన్ని అభినందిస్తూ వారి వెంట ఉంటామని తేల్చి చెప్పారు. 1973లో హెచ్‌సీయూ పెట్టినప్పుడు 2374 ఎకరాలు ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యమని రోజూ చెప్పే రేవంత్‌రెడ్డి.. ఇందిరమ్మ హయాంలో ఇచ్చిన భూములను వ్యాపారం కోసం ఎలా వాడతారు?. అని ప్రశ్నించారు.
రెండు పార్టీలూ దొందు దొందే..
పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు హెచ్‌సీయూ ముఖం చూడని కేటీఆర్ ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్‌కు యూనివర్సిటీ భూములపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఆ పార్టీ విశ్వసనీయత కోల్పోయిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు విద్యార్థుల ముందుకెళ్లి మొసలి కన్నీళ్లు కార్చుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ నాణేనికి బొమ్మా, బొరుసు వంటివి అన్నారు. గులాబీ జెండాపై ఎమ్మెల్యేలుగా గెలిచి, మూడు రంగుల జెండాపై పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారని, రెండు పార్టీలది వీణా-వాణిలా విడదీయరాని బంధమని విమర్శించారు.