Kishan Reddy: రేవంత్ పాలనలో మారిందేంటి?.. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ పాలన!
Union Minister Kishan Reddy Press Meet: మార్పు తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏం మార్పు తీసుకొచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ పాలన కూడా ఉందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మీద 11 నెలల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. దేశంలోని ఏ ప్రభుత్వం మీద ఈ స్థాయిలో వ్యతిరేకత రాలేదని చెప్పారు. బుధవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ఈ భేటీ అనంతరం కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సేమ్ టు సేమ్ రాజకీయాలు చేస్తున్నాయన్నారు.
కాంగ్రెస్ అబద్ధపు హామీలు..
కాంగ్రెస్ ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చిందన్నారు. హామీలను అమలు చేయకపోవడం కాంగ్రెస్ పార్టీకే చెల్లిందన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నదని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరి ఎంపీలుగా పోటీ చేశారన్నారు. ఇంతకంటే స్పీకర్ కు సాక్ష్యం ఏం కావాలని ప్రశ్నించారు. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏమిటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
నాది బీజేపీ పార్టీ డీఎన్ఏ..
బెదిరింపులు, తిట్ల పురాణాలు తప్ప కాంగ్రెస్ సాధించిందేమీ లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. సమస్యలపై మాట్లాడితే నా డీఎన్ఏ ఏంటని సీఎం రేవంత్ మాట్లాడుతున్నారన్నారు. నాది బీజేపీ పార్టీ డీఎన్ఏ అన్నారు. మిగతావారి మాదిరిగా పది పార్టీలు తిరిగిన డీఎన్ఏ కాదన్నారు. మూసీపై ఆందోళన చేస్తే గుజరాత్ గులాం అని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా పాలనపై కాంగ్రెస్ దృష్టి పెట్టాలని సూచించారు. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలంగాణ నష్టపోతోందన్నారు. తెలంగాణలో రాజకీయ వ్యవస్థ భ్రష్టుపట్టిపోతోందన్నారు. బీఆర్ ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటేనని కిషన్రెడ్డి ఆరోపించారు.
డిసెంబర్ 1 నుంచి కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రచారం..
డిసెంబర్ 1 నంచి 5 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలోని వైఫల్యాలను రాష్ట్రవ్యాప్తంగా వివరిస్తామన్నారు. నాలుగైదు నెలలుగా రెసిడెన్షియల్ స్కూళ్లలో అనేక ఘటనలు జరుగుతుంటే సీఎం పట్టించుకోవడం లేదన్నారు. సీఎం ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దాడులు చేసేందుకు పెట్టే సమయం ప్రభుత్వం గాడిన పెట్టడంపై వెచ్చిస్తే బాగుంటుందన్నారు. వాంకిడి పాఠశాలలో శైలజ అనే గిరిజన అమ్మాయి ఫుడ్ పాయిజనింగ్ తో చనిపోయిందన్నారు. ఇలాంటి వాటిపై సీఎం దృష్టి సారించాలన్నారు.
ప్రభుత్వాలు కూల్చే అవసరం లేదు..
తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన బీజేపీకి లేదన్నారు. తెలంగాణతో పాటు కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టే ఆలోచన మాకు లేదన్నారు. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలంగాణ నష్టపోతున్నదన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చేయలేదన్నారు. రైతుభరోసా, దళిత బంధు ఇప్పటి వరకు ఒక్కరికీ కూడా ఇవ్వలేదన్నారు. ఒక్క పెన్షన్, కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోయినా ఇంకా బుల్డోజర్లతో తొక్కిస్తా అనే మాటలనే సీఎం మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం హుందాగా వ్యవహరించాలన్నారు. ప్రశ్నించేవారి పట్ల అన్ పార్లమెంటరీ భాషను కేసీఆర్ ప్రవేశపెడితే దాన్ని రేవంత్ రెడ్డి విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు.
డిసెంబర్ నెలాఖరు నాటికి కొత్త స్టేట్ చీఫ్..
ఈ నెలాఖరు వరకు అన్ని గ్రామ కమిటీలు పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ మొదటి వారంలో మండల కమిటీలు, ఆ జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం జాతీయ అధ్యక్షుడిని నియమిస్తారని చెప్పారు. షెడ్యూల్ డిసైడ్ అయిందని చెప్పారు. డిసెంబర్ చివరి నాటికి రాష్ట్ర, జాతీయ అధ్యక్షులు వస్తారని చెప్పారు.