Last Updated:

Srivani Trust: టీటీడీ బోర్టు సంచలన నిర్ణయాలు.. శ్రీవాణి ట్రస్ట్ రద్దు

Srivani Trust: టీటీడీ బోర్టు సంచలన నిర్ణయాలు.. శ్రీవాణి ట్రస్ట్ రద్దు

Srivani Trust Cancellation: టీటీడీ పాలక మండలి సోమవారం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు అధ్యక్షతన సోమవారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో భక్తులకు వేగంగా దర్శనం కల్పించటం మొదలు టీటీడీ ఉద్యోగుల వరకు పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది.

శ్రీవాణి ట్రస్ట్ రద్దు
గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన శ్రీవాణి ట్రస్ట్‌ను రద్దుచేస్తున్నట్లుగా టీటీడీ పాలకమండలి సమావేశం అనంతరం టీటీడీ ఛైర్మన్ బి. ఆర్. నాయుడు ప్రకటించారు. అదే సమయంలో సామాన్య భక్తులకు రెండు, మూడు గంటల్లోనే దర్శనం కల్పించేలా మార్పులు చేసేందుకు ప్రణాళికను ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. కంపార్ట్‌మెంట్లలో భక్తులు పూటల తరబడి ఇబ్బందులు పడకుండా త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు త్వరలోనే కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. తిరుపతి వాసులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించేలా టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది.

అన్యమత ఉద్యోగుల బదిలీ..
తిరుమలలో తరచూ వివాదానికి దారితీస్తున్న అన్యమత ఉద్యోగుల మీదా టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే టీటీడీలోని అన్యమత ఉద్యోగులను వీఆర్ఎస్ లేదా ప్రభుత్వ శాఖల్లోకి బదిలీ చేయాలని నిర్ణయించింది. అలాగే, టీటీడీ ఉద్యోగులకు ఇస్తున్న బ్రహ్మోత్సవ బహుమానాన్ని రూ.14 వేల నుంచి రూ.15,400లకు పెంచుతూ బోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కొండపై రాజకీయాలకు చెక్
స్వామి దర్శనం కోసం తిరుమలకు వచ్చి అక్కడ రాజకీయాల గురించి మాట్లాడటం ఇక కుదరదని టీటీడీ ఛైర్మన్ స్పష్టం చేశారు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారిపైనైనా కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు. అలాగే, టూరిజం శాఖకు కేటాయిస్తున్న 4 వేల ఎస్ఈడీ టిక్కెట్లు రద్దు చేస్తూ టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది.

స్వామి సొమ్ముకు భద్రత
స్వామివారికి టికెట్ల విక్రయం ద్వారా వచ్చే సొమ్మును ఇకపై టీటీడీ అకౌంట్‌లోనే జమ అయ్యేలా చూడటంతో బాటు స్వామివారి పేరిట ఉన్న పలు ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లను ప్రభుత్వ బ్యాంకులకు మార్చాలని పాలకమండలి నిర్ణయించింది.
అలాగే, తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను 3 నెలల్లో క్లియర్ చేయాలని, శ్రీనివాససేతు పేరుని గరుడ వారధిగా మార్పు చేస్తున్నట్లు పాలకమండలి ప్రకటించింది.

ఆ భూములు వెనక్కి..
అలిపిరిలో దేవలోక్‌కు కేటాయించిన 20 ఎకరాల భూమిని టీటీడీకి అప్పగించే విధంగా ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించినట్లు బి.ఆర్. నాయుడు ప్రకటించారు. వైసీపీ హయాంలో శారద పీఠానికి కేటాయించిన భూములు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకోవటంతో బాటు ఆ స్థలంలో పీఠం నిర్మించిన బిల్డింగ్‌ని కూల్చివేయాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు, స్వామి భక్తులకు అందించే అన్న ప్రసాదంలో కొత్తగా మరో వంటకాన్ని చేర్చాలని, శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యమైన నెయ్యి వినియోగించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించింది.