Hydra: మళ్లీ హైడ్రా కలకలం.. కూల్చివేతలు షురూ
Hydra Action Again In Hyderabad City: ఆక్రమణలు చేసిన అక్రమార్కుల పాలిట ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా కొంత విరామం తర్వాత మళ్లీ రంగంలోకి దిగింది. నగర శివారు ప్రాంతమైన అమీన్ పూర్లో ఓ అక్రమ నిర్మాణాన్ని హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. గతంలో నోటీస్ ఇచ్చినప్పటికీ ఇళ్లను తొలగించకపోవడంతో హైడ్రా రంగంలోకి దిగాల్సి వచ్చిందని ఒక అధికారి తెలిపారు.
మళ్లీ కూల్చివేతలు షురూ
సోమవారం ఉదయమే అమీన్ పూర్ పరిధిలోని వందనాపురి కాలనీకి చేరుకున్న అధికారులు అక్కడి 848 సర్వే నంబర్లోని అక్రమ నిర్మాణాన్ని కూల్చవేయనున్నట్లు ప్రకటించారు. రోడ్డును ఆక్రమించి కట్టిన కారణంగానే దీనిని కూల్చవేస్తున్నామని, దీనికి సంబంధించి గతంలో నోటీసులు ఇచ్చినా ఆక్రమణదారు స్పందించలేదని వారు తెలిపారు. అనంతరం భారీ యంత్రాల సాయంతో అధికారుల పర్యవేక్షణలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన భవనాన్ని నేలమట్టం కూల్చివేశారు. మరోవైపు, ఇదే అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో మరో రెండు చోట్ల అక్రమ నిర్మాణాలను గుర్తించారు. వీటికి కూడా నోటీసులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. కాగా, ఇటీవల నాగారం మున్సిపాలిటీలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఇళ్లను కూడా హైడ్రా అధికారులు కూల్చివేయటంతో మరోసారి హైడ్రా అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించిందని పలువురు భావిస్తున్నారు.
రంగనాథ్ పర్యటన..
మరోవైపు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ సోమవారం నగరంలోని పలు చెరువులను పరిశీలించారు. చందానగర్ పరిధిలోని భక్షికుంట, రేగులకుంటలోని చెరువులను కమిషనర్ స్వయంగా పరిశీలించారు. స్థానిక అపర్ణ హిల్స్ లోని మురుగు నీరు చెరువుల్లోకి చేరకుండా మళ్లించిన విధానంను రంగనాథ్ అడిగి తెలుసుకున్నారు. దీప్తిశ్రీ నగర్లోని రేగులకుంట చెరువులో నీటి స్వచ్ఛతను పరిశీలించి, స్థానికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రజా అవసరాలకు ప్రభుత్వం కేటాయించిన 5 వేల గజాల స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు కాజేయాలని చూస్తున్నారంటూ దీప్తిశ్రీ నగర్ వాసులు రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. చెరువులతోపాటు పార్కుల స్థలాలను కూడా రక్షించాలని రంగనాథ్ ను కోరారు. దీనిపై స్పందించిన కమిషనర్.. అధికారులతో వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చెరువులు, కుంటాల స్థలాలను ఎవరు ఆక్రమించినా ఉపేక్షించేది లేదని, చెరువుల పరిరక్షణకు స్థానికులు కూడా ముందుండాలని రంగనాథ్ పిలుపునిచ్చారు.