Middle East countries: మిడిల్ ఈస్ట్ దేశాలకు పొంచి ఉన్న ముప్పు..
వాతావరణ సమతుల్యం దెబ్బతినడంతో మధ్యప్రాచ్యదేశాల్లో పెద్ద ఎత్తున ప్రజలు నిరాశ్రయులయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Prime9Special: వాతావరణ సమతుల్యం దెబ్బతినడంతో మధ్యప్రాచ్యదేశాల్లో పెద్ద ఎత్తున ప్రజలు నిరాశ్రయులయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతి తక్కువ వర్షపాతం నమోదు కావడంతో పాటు విపరీతమైన వేడి గాడ్పుల కారణం. ఈ ప్రాంతాల్లో కరువులాంటి పరిస్థితులు నెలకొంటాయి. ప్రపంచంలోనే అత్యల్పంగా ఈ ప్రాంతంలో నీరు అందుబాటులో ఉండటంతో లక్షలాది మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు శరణార్థులుగా వెళ్లాల్సి రావచ్చు. కాగా ఈ నెలలోనే ఈజిప్టులో కాప్27 గ్లోబల్ క్లయిమెట్ సమ్మెట్ జరగనుంది. వాతావరణంలో మార్పుల కారణంగా ఇప్పటికే ఈజిప్టు నుంచి ఇతర ప్రాంతాలకు ప్రజలు శరణార్థులుగా తరలిపోతున్నారు.
ఇక ఈజిప్టు విషయానికి వస్తే ప్రపంచంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదు అవుతోంది. దీంతో పాటు ఇక్కడ వ్యవసాయం పెద్ద లాభసాటి వ్యాపారం కూడా కాదు. ఎందుకంటే వాతావరణ సమతూల్యం దెబ్బతినడంతో ఇక్కడ పంటలు పండవు. దీంతో ఇక్కడి గ్రామీణ యువత బతుకు దెరువు కోసం విదేశాలకు లేదా పెద్ద పట్టణాలకు వెళ్లి పరిశ్రమలో పనికి చేరుతున్నారు. ఐక్యరాజ్యసమితి శరణార్థి విభాగం అంచనా ప్రకారం 90 శాతం శరణార్థులు మధ్య ప్రాచ్యదేశాలకు చెందిన వారు కావడం విశేషం. ప్రజలకు వ్యవసాయం అందుబాటులో లేకపోవడం. చేయడానికి పనిలేకపోవడం లేదా ప్రజలు తినడానికి ఆహారం లేకపోతే ప్రత్యామ్నాయం ఆలోచించుకోవాల్సిందేనని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ఐఓఎం డిప్యూటీ డైరెక్టర్ అమి పోప్ పేర్కొన్నారు.
గత ఏడాది ప్రకృతి వైపరీత్యాల వల్ల సుమారు 30 లక్షల మంది ప్రజలు ఆఫ్రికాతో పాటు మధ్యప్రాచ్యదేశాల నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. భవిష్యత్తులో పరిస్థితులు మరింత ఘోరంగా తయారయ్యే అవకాశాలున్నాయని ఆమె అన్నారు. సముద్రాలు ఉప్పొంగడంతో కొన్ని దేశాలకు ప్రమాదం పొంచి ఉంది. 2060 నాటికి ఈజిప్టు 47 శాతం మునిగిపోయే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ వ్యవసాయం రంగం అంతం మాత్రంగా ఉంది. దీంతో పరిస్థితులు మరింత దారుణంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు వ్యవసాయరంగంలో దిగుబడి తగ్గిపోవడంతో గ్రామీణ ప్రాంతాల వారు పట్టణ ప్రాంతాల వారు నగరాలకు వలసలకు వెళ్లాల్సి రావచ్చు. నగర జీవనం ఆకర్షణీయంగా ఉండటంతో పాటు ఇక్కడ లభించే సేవల వల్ల వీరంతా నగరాల పై మళ్లే అవకాశం ఉందని కెయిర్‌లో పరిశోధకులు అంచనా వేశారు.
ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం 2050 నాటికి వాతావరణ సమతూల్యం దెబ్బతినకుండా ఉండటానికి చర్యలు తీసుకోకపోతే, 216 మిలియన్‌ల ప్రజలు నిరాశ్రయులయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. వారిలో ఉత్తర ఆఫ్రికాకు చెందిన 19.3 మిలియన్ ప్రజలు కూడా ఉన్నారు. ఉత్తర ఆఫ్రికాలో సుమారు ఏడు శాతం ప్రజలు తీర ప్రాంతాల్లో ఉండే వారు నిరాశ్రయులవుతారు. సముద్రాలు ఉప్పొంగడం వల్ల వీరంతా నిరాశ్రయులవుతారు. సముద్రాలు ఐదు మీటర్లు లేదా 16 అడుగులు ముందుకు చొచ్చుకువచ్చే అవకాశం ఉందని యూరోపియన్ ఇన్సిస్టిట్యూఆఫ్ ది మెడిటరేరియన్ అంచనా వేసింది. సముద్రాలు ముందుకు చొచ్చుకు రావడంతో తీర ప్రాంతాల్లోని ప్రజలు సహజంగానే పెద్ద నగరాలు కెయిరో, అల్జీర్స్, ట్యునీస్, ట్రిపోలీ, కాసాబ్లాంకా రాబాట్ ఏరియాతో పాటు టాంజియార్ ప్రాంతాలకు శరణార్థులుగా వెళ్లాల్సి రావచ్చు. దీంతో ఆక్కడి స్థానిక ప్రజల పై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రపంచబ్యాంకు హెచ్చరించింది. సముద్రం ఒక అరమీటర్ ఉప్పొంగితే ఈజిప్ట్‌లోని అలెగ్జాండ్రియాలో 20 లక్షల మంది ప్రజలతోపాటు రెండు లక్షల 14వేల ఉద్యోగాల పై ప్రభావం చూపుతాయని వెల్లడించింది.
వాతావరణ సమతుల్యం దెబ్బతినడంతో పట్టణాలకు వలసలు పెరుగుతాయి. అదే సమయంలో ప్రకృతి సహజ వనరుల పై ఒత్తిడి పెరుగుతుందని ఆర్థిక వేత్త అస్సామీ అబు హతాబ్ చెప్పారు. దీంతో సమాజంలో అశాంతి నెలకొంటుంది. అదీ కాస్తా హింసకు దారితీస్తుంది. కాగా ఈ ప్రాంతాల్లో వ్యవసాయరంగం 22 శాతం మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇప్పటికే సూడాన్‌లో మంచినీటితో పాటు భూమి కోసం కోసం గిరిజన తెగల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ప్రతి ఏడాది వందల మంది చనిపోతున్నారు. రెండు రోజుల క్రితం ఇక్కడ దక్షిణ బ్లూనైల్ రాష్ర్టంలో చెలరేగిన హింస వల్ల సుమారు 200 మంది మరణించారు. యూనిసెఫ్ అంచనా ప్రకారం ప్రపంచంలోనే అతి తక్కువ నీరు లభించే ప్రాంతాలు 17 మధ్య ప్రాచ్యదేశాల్లో ఉండగా 11 ఉత్తర అమెరికాలో ఉన్నాయి.
ఇక ఇరాన్‌ను తీసుకుంటే ఇప్పుడున్న ఎండలకు అదనంగా ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగితే 20 శాతం మంచినీరు ఆవిరి అవుతుంది. వర్షపాతం పదిశాతం తగ్గుతుందని ప్రపంచబ్యాంకు వెల్లడించింది. మూడో వంతు వ్యవసాయ భూములు వ్యవసాయానికి పనికి రాకుండా పోతాయి. ఇక్కడ నివసించే 42 మిలియన్ ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక జోర్డాన్‌ను తీసుకుంటే ప్రపంచంలోనే అతి పొడి ప్రాంతం. గత ఏడాది ఇజ్రేల్ నుంచి పెద్ద ఎత్తున నీటిని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గాజా నుంచి నీటి రాకపోకలను అనుమతించపోవడంతో జోర్డాన్ నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.