Last Updated:

Minister Roja: మంత్రి రోజాకు తప్పని ఇంటిపోరు

వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు పొందిన మంత్రి రోజాకు ఇంటిపోరు మాత్రం తప్పడం లేదు. సీఎం జగన్‌కు సన్నిహితురాలిగా పేరుపొందిన ఆమె, రాజకీయ పరిస్థితి పైకి బాగానే ఉన్నట్టుగా కనిపిస్తున్నా, సొంత నియోజకవర్గం నగరిలో మాత్రం ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Minister Roja: మంత్రి రోజాకు తప్పని ఇంటిపోరు

Andhra Pradesh: వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు పొందిన మంత్రి రోజాకు ఇంటిపోరు మాత్రం తప్పడం లేదు. సీఎం జగన్‌కు సన్నిహితురాలిగా పేరుపొందిన ఆమె, రాజకీయ పరిస్థితి పైకి బాగానే ఉన్నట్టుగా కనిపిస్తున్నా, సొంత నియోజకవర్గం నగరిలో మాత్రం ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఇబ్బందులు ప్రత్యర్థి పార్టీల నుంచి కాదు. సొంత పార్టీ నుంచే అసమ్మతి వర్గం నేతలకు మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి అండదండలున్నాయన్న టాక్‌ నడుస్తోంది.

మంత్రి రోజాను అసమ్మతి సెగ వెంటాడుతోంది. 2019 ఎన్నికల నాటి నుంచి నగరిలో వర్గపోరుతో నెట్టుకొస్తున్న ఆమెకు, రాను రాను అది మరింత ఇబ్బందిగా మారింది. గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తనకు వ్యతిరేకంగా పనిచేసిన వర్గాన్ని ఖంగు తినిపించిన రోజా. పార్టీ హైకమాండ్ వద్ద తనదే పై చేయిగా నిరూపించారు. ఈ నేపథ్యంలోనే వ్యతిరేక వర్గాలన్నీ ఒక్కటయ్యాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి బర్త్ డే వేడుకలను పోటాపోటీగా నిర్వహించాయి. మున్సిపల్ మాజీ అధ్యక్షుడు కేజే కుమార్, ఆయన భార్య రాష్ట్ర ఈడిగ కార్పొరే షన్ చైర్పర్సన్ కే.జే శాంతి, శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, వడలమాలపేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి, పుత్తూరు నుంచి అమ్ములు రోజా వ్యతిరేక వర్గంలో ప్రముఖులు. ఆది నుంచి పార్టీకి పని చేస్తున్న నేతలను రోజా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో పార్టీకి కష్టపడిన వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చినవారిని అందలం ఎక్కించి నగిరిలో పాలన సాగిస్తున్నారని వారు మండిపడుతున్నారు.

సొంత పార్టీలోని అసమ్మతి వర్గం నాయకులు తరుచుగా రోజాకు ఇబ్బందులు తీసుకొచ్చే విధంగా వ్యవహారాలు చేస్తూ ఉండడం, ఆమెకు వ్యతిరేకంగా సొంతంగా కార్యక్రమాలు చేపడుతూ ఉండడం ఇవన్నీ ఎప్పటి నుంచో రోజాకు ఇబ్బందికరంగా మారాయి. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండతో అసమ్మతి వర్గం దూకుడుగా వ్యవహరిస్తుందని రోజా వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. సొంత పార్టీలోని అసమ్మతి నాయకులకు పరోక్షంగా హెచ్చరికలు చేస్తూ రోజా అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల రోజాకు మంత్రి పదవి దక్కడంతో అసమ్మతి నాయకులు సెట్ అవుతారని, పూర్తిగా నియోజకవర్గంలో పరిస్థితులు తన ఆధీనంలోకి వస్తాయని ఆమె భావించినా, పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో మొదలైన విభేదాలు పరిషత్, మునిసిపల్ ఎన్నికల్లోను బాగా కనిపించాయి. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి ఎటువంటి నామినేటెడ్ పదవులు ఇవ్వద్దంటూ రోజా అధిష్టానానికి చెప్పినా, శ్రీశైలం ఆలయ చైర్మన్ పదవిని చక్రపాణి రెడ్డికి, భార్యకు మరో నామినేటెడ్ పోస్టును ఇచ్చారు.

నగరి నియోజకవర్గంలో రెండు వర్గాల నేతలు తరచూ పోటా పోటీగా బ్యానర్లు ఏర్పాటు చేస్తూ సై అంటే సై అంటున్నారు. ఇది విపక్ష టీడీపీకి ఎంతో మేలు చేస్తోందని, క్రమంగా ఆ పార్టీ నియోజకవర్గంలో బలపడుతోందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే వచ్చే ఎన్నికల్లో నగరిలో టీడీపీ పాగా వేయడం ఖాయమని వారు జోస్యం చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే, రోజా వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్న అసమ్మతివర్గం నేతలు, ఆమెకు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ దక్కకుండా వ్యూహ రచన చేస్తున్నారు. రోజా కుటుంబ సభ్యుల్లోనే ఒకరు టికెట్‌ కావాలని ఇటీవల సీఎం జగన్‌ను కలిశారన్న ప్రచారం జరుగుతోంది. నిత్యం పవన్‌ కల్యాణ్‌పై విరుచుకుపడే రోజా, ముందు ఇంటి పోరు చూసుకోవాలంటున్నారు జనసేన నేతలు. నిత్యం నగరిలో అసమ్మతిని ఎదుర్కొంటున్న మంత్రి రోజా పవన్ లాంటి మర్యాదస్తుల మీద విరుచుకుపడుతూ తమ ప్రతాపాన్ని ప్రదర్శిస్తుంటారు. మరి, అలాంటి ఫైర్ బ్రాండ్ నేత తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలో తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఊరంతటికి నీతులు చెప్పే ఆర్కే రోజాకు  తాను ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న నగరిలో సొంత పార్టీ నేతలకు సమాధానం చెప్పలేక బేలతనాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా నగరి వైసీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. కొప్పేడులో రైతు భరోసా కేంద్రానికి రోజా వ్యతిరేక వర్గం నేత చక్రపాణిరెడ్డి భూమి పూజ చేశారు. అయితే, తనకు సమాచారం ఇవ్వకపోవడంపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పిలవకుండా భూమి పూజ చేయడం పై మండిపడ్డారు. టీడీపీ, జనసేన వాళ్లు నవ్వుకునే విధంగా.. తనకు నష్టం కలిగించేలా భూమి పూజ ఎలా చేస్తారని రోజా ప్రశ్నించారు. తన వైరి వర్గానికి చెందిన సొంత పార్టీ నేతల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ”ఇలాంటి వారు పార్టీలో ఉంటే నేను రాజకీయాలు చేయటం కష్టం. నాకు నష్టం కలిగించేలా కార్యక్రమాలు చేయటం పై పార్టీ పెద్దలు ఆలోచించాలన్న రోజా ఆడియో లీకై వైరల్ అయింది.

నిత్యం, చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ లాంటి వ్యక్తుల్ని విమర్శిస్తూ జగన్‌ దృష్టిలో పడాలన్న తపన రోజాలో ఎక్కువు అవుతోందట. విపక్ష నేతల్ని ఎంత ఎక్కువ తిడితే, జగన్‌ దగ్గర మరిన్ని మార్కులు కొట్టేయాలన్నది మంత్రి రోజాగారి ప్లాన్‌ అట. మొన్నటికి మొన్న విశాఖలో తన చేతి వేళ్లు చూపుతూ రోజా రెచ్చగొట్టడం వల్ల జరిగిన పరిణామాలు ఎవరూ మర్చిపోరు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ రెచ్చగొట్టేలా మాట్లాడం ఎంతవరకు సమంజసమో రోజా ఆలోచించుకోవాలి. ప్రత్యర్థులను ఇష్టమున్నట్లు తిట్టే బదులు ముందు సొంత ఇంటిని చక్కదిద్దికోవాలని రాజకీయ పరిశీలకులు హితవు పలుకుతున్నారు.

ఇవి కూడా చదవండి: