YS Jagan Palnadu Tour: నేడు పల్నాడు జిల్లాకు వైఎస్ జగన్.. అంతా టెన్షన్ టెన్షన్
YS Jagan Palnadu Tour: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. పోలీసుల వేధింపులతో గత ఏడాది సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి చెందిన వైసీపీ నేత, ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు సూసైడ్ చేసుకున్నారు. కాగా ఆయన కుటుంబాన్ని వైఎస్ నేడు పరామర్శించనున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం తాడేపల్లిలోని తన నివాసానికి జగన్ వెళ్లనున్నారు.
ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ రెంటపాళ్లకు చేరుకుంటారు. ఉదయం 12 గంటల వరకు వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులతో గడపనున్నారు. అనంతరం విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. మధ్నాహ్నం 12 గంటలకు బయల్దేరి తాడేపల్లికి వెళ్లనున్నారు.
కాగా వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పల్నాడు జిల్లాలో పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్ వెంట కేవలం 3 వాహనాలు, 100 మంది వ్యక్తులు మాత్రమే వెళ్లాలని పోలీసులు సూచించారు. కానీ జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. జనసమీకరణపై ఆంక్షలు పెట్టారు. తమ ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సత్తెనపల్లి నుంచి రెంటపాళ్ల వెళ్లే దారిలో పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. రాజుపాలెం మండలం కొండమోడు వద్ద తనిఖీలు చేపట్టారు.