Encounter in Maredumilli: అల్లూరి జిల్లాలో ఎన్ కౌంటర్.. మావోల కీలక నేతలు మృతి!
Encounter in Alluri District: దేశంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. మావోయిస్టులను రూపుమాపేందుకు భద్రతా బలగాలు అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. చనిపోయిన వారిలో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు ఉదయ్, అరుణగా గుర్తించారు. కాగా మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉదయ్ ఉన్నారు. అలాగే మావోయిస్టు జోనల్ కమిటీ సభ్యురాలిగా అరుణను గుర్తించారు. ఎదురుకాల్పుల్లో కొందరు మావోలు పారిపోయినట్టు సమాచారం. మరోవైపు అడవుల్లో పోలీసుల కూంబింగ్ జరుగుతోంది. దీంతో దండకారణ్యం అలజడి నెలకొంది. ఇప్పటికే జరిగిన ఎన్ కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు, పలువురు కీలక నేతలు చనిపోయారు.
కాగా ఘటనాస్థలిలో మూడు ఏకే- 47 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్ లో చనిపోయిన మావోయిస్టు ఉదయ్ పై రూ. 25 లక్షల రివార్డ్ ఉంది. ఉదయం స్వస్థలం భూపాలపల్లి జిల్లా వెలిశాలగా గుర్తించారు. చనిపోయిన మరో మావోయిస్టు అరుణపై రూ. 20 లక్షల రివార్డు ఉంది. ఈమె మావోయిస్టు అగ్రనేత చలపతి భార్యగా గుర్తించారు. అరకు దివంగత ఎమ్మెల్యే కిడారి, మరోనేత సివేరి సోమ హత్యలో అరుణ పాల్గొన్నట్టు పోలీసులు తెలిపారు. భర్త చలపతితో కలిసి మావోయిస్టు కార్యకలాపాలు సాగించారని వెల్లడించారు. కాగా ఎన్ కౌంటర్ లో చనిపోయిన మరో మావోయిస్టును అంజుగా గుర్తించారు.