Last Updated:

Bandaru Dattatreya: అంబర్‌పేట బరిలో దత్తన్న వారసురాలు?

తెలంగాణ బీజేపీలో రేసులోకి మరో వారసురాలు వస్తున్నట్లే కనిపిస్తోంది. సీనియర్‌ నేత, హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ వారసురాలు రాజకీయం రంగంలోకి అడుగుపెట్టేందుకు గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారు.

Bandaru Dattatreya: అంబర్‌పేట బరిలో దత్తన్న వారసురాలు?

Hyderabad: తెలంగాణ బీజేపీలో రేసులోకి మరో వారసురాలు వస్తున్నట్లే కనిపిస్తోంది. సీనియర్‌ నేత, హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ వారసురాలు రాజకీయం రంగంలోకి అడుగుపెట్టేందుకు గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారు. బీజేపీ హైకమాండ్‌ ఓకే అంటే ఆమె అంబర్‌పేట నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్న టాక్‌ నడుస్తోంది.

తన జీవిత కాలం అంతా బీజేపీ కోసం అంకితం చేసిన నాయకుడు బండారు దత్తాత్రేయ. ఆయన రెండు సార్లు ఎంపీగా నెగ్గారు. కేంద్ర మంత్రిగా పనిచేసారు. ఇపుడు హర్యానా గవర్నర్ గా ఉంటున్నారు. ఆయన రాజకీయ వారసురాలుగా ఏకైక కుమార్తె బండారు విజయలక్ష్మి రావడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఆమె వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయడానికి అన్నీ సమకూర్చుకుంటున్నారు. ఆ విషయాన్ని ఇటీవల జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ప్రకటించేశారు విజయలక్ష్మి. తన తండ్రి దత్తాత్రేయతో పాటు సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలోనే ఆమె ఈ విషయాన్ని తెలియచేశారు. బీజేపీ కనుక తనకు రాజకీయ అవకాశాన్ని కల్పిస్తే తాను సిద్ధమని చెప్పేశారు.

ఆమె అంబర్‌పేట సీటు మీద కన్నేసినట్లు తెలిసింది. గతంలో ఇక్కడ కిషన్ రెడ్డి గెలిచారు. బీజేపీకి ఇది గెలిచే సీటుగా చెబుతారు. ఇక కిషన్ రెడ్డి, దత్తాత్రేయ ఖాళీ చేసిన సికింద్రబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. కేంద్ర మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన మరోసారి అదే సీటు నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. దాంతో కిషన్‌రెడ్డి సొంత అసెంబ్లీ సీటు అయిన అంబర్ పేట నుంచి పోటీకి దత్తాత్రేయ కుమార్తె రెడీ అవుతున్నారని వినిపిస్తున్న మాట. అయితే కిషన్ రెడ్డి తన సొంత సీటుని దత్తన్న ఫ్యామిలీకి త్యాగం చేయడానికి ఏమంటారో చూడాలి. కిషన్ రెడ్డి పోటీ చేయకపోతే ఆయన అనుచరులు ఎవరైనా రంగంలోకి దిగుతారేమో అన్న చర్చ కూడా సాగుతోంది. బండారు దత్తాత్రేయ కూడా తన కుమార్తె విజయలక్ష్మిని రాజకీయాల్లో యాక్టివ్ చేయాలనుకుటున్నారు. తను ప్రతీ ఏడాది దసరా తర్వాతి రోజు నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఈసారి తన కుమార్తె చేతుల మీదుగానే నిర్వహింపజేశారు. దత్తాత్రేయ లాంటి సీనియర్ పార్టీ కోసమే జీవితాన్ని త్యాగం చేసిన నేత అడిగితే బీజేపీ కాదంటుందా, వారసులు అనే నిబంధన ఇతర పార్టీలకే పరిమితం కాబట్టి, చాన్సిచ్చేయడం ఖాయమని అనుకోవచ్చు.

ఇక వచ్చే ఎన్నికలను చాలా కీలకంగా భావిస్తున్న బీజేపీ ఎంపీలను, కేంద్ర మంత్రిని కూడా పోటీకి దించబోతోంది అన్న చర్చ సాగుతోంది. అదే జరిగితే అంబర్ పేట నుంచి కిషన్ రెడ్డి మళ్లీ పోటీకి దిగే అవకాశం ఉందంటున్నాయి బీజేపీ వర్గాలు. ఒకవేళ ఆయన కాదంటే బండారు దత్తాత్రేయ కుమార్తెకు చాన్స్ ఉంటుంది అని చెబుతున్నారు. పార్టీ కోసం ఎంతో చేసిన దత్తాత్రేయ మీద ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షాలకు మంచి అభిప్రాయం ఉంది. దాంతో ఆమె టికెట్ కి బీజేపీ ఓకే అనవచ్చు అని అంటున్నారు. సో దత్తన్న వారసురాలు ఎంట్రీ ఖాయమన్న మాట వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి: