Bandi Sanjay: నేటితో ముగియనున్న బండిసంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర.. కరీంనగర్‌లో బహిరంగసభ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదవ విడత ప్రజాసంగ్రామ యాత్ర ఇవాళ్టితో కరీంనగర్‌లో ముగియనుంది.
Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదవ విడత ప్రజాసంగ్రామ యాత్ర నేటితో కరీంనగర్‌లో ముగియనుంది. ఈ రోజుతో సంజయ్ 14వందల కిలోమీటర్ల పైగా దూరాన్ని పూర్తి చేయనున్నారు. ముగింపు సందర్భంగా ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. రాష్ట్ర బీజేపీ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, మధ్యప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధర్ రావు సహా పలువురు ముఖ్య నేతలు హాజరవుతారు.
మలివిడత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి రాజకీయంగా కేసీఆర్ గ్రాఫ్ పెరగడానికి, 2001లో కరీంనగర్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్ సభ దోహదపడిందని బీజేపీ ముఖ్యనేతలు భావిస్తున్నారు. ఇప్పుడదే చోట బీజేపీ బలం నిరూపించేలా సభను విజయవంతం చేయడం ద్వారా.. బీఆర్‌ఎస్‌గా మారిన టీఆర్‌ఎస్ పతనం ప్రారంభమైందనే సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలని భావిస్తున్నారు.ఉత్తర తెలంగాణ నుంచి ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఇతర జిల్లాల నుంచి భారీగా ప్రజలు, కార్యకర్తల సమీకరణ ద్వారా ఈ సభను సూపర్ సక్సెస్ చేసే ఏర్పాట్లలో బీజేపీ నేతలు నిమగ్నమయ్యారు. పార్టీ గెలుచుకున్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీ సీట్ల పరిధిలో పార్టీకి అత్యధిక మద్దతు, పట్టు ఉండడంతో పాటు హిందూత్వ భావజాలం, యువకుల మద్దతు ఎక్కువగా ఉండడంతో సభ అంచనాలకు మించి విజయవంతం అవుతుందని వారు భావిస్తున్నారు.
ఐదో విడత కూడా కలిపితే మొత్తం 56 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యాత్ర కొనసాగినట్టవుతుంది. సంజయ్‌ను భైంసా పట్టణానికి అనుమతించక పోవడాన్ని, తర్వాత ఆయన భైంసా అల్లర్ల బాధితులను కలుసుకుని భరోసా కల్పించడాన్ని, గల్ఫ్ బాధితులు, కొండగట్టు ప్రమాద బాధితులను పరామర్శించడాన్ని, ఇతర పరిణామాలను బీజేపీ కార్యకర్తలు గుర్తుచేసుకుంటున్నారు. అటు నడ్డా ఇవాళ మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగుతారు. ఎయిర్‌పోర్టులోనే పార్టీ నేతలతో సమావేశమవుతారు.తర్వాత కరీంనగర్ బయలుదేరి వెళతారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో 2:50కి కరీంనగర్ బయల్ధేరి 3:30కి చేరుకుంటారు. హెలిప్యాడ్ నుంచి సభా స్థలికి 3:40కి చేరుకుని 4:35 వరకు సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సభ ముగిసిన అనంతరం జేపీ నడ్డా నేరుగా హెలికాప్టర్‌లో శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5:35కి ప్రత్యేక విమానంలో దిల్లీకి బయల్ధేరి వెళ్లనున్నారు.
రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో జేపీ.నడ్డా రాక చర్చనీయాంశంగా మారింది. బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, దిల్లీ లిక్కర్ స్కాం, బీ ఆర్ ఎస్ ఆవిర్భావంపై కమలదళపతి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. మరొక్క వైపు ఈ బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపి మాత్రమే అనే సంకేతాలను పంపాలని కమలదండు భావిస్తోంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి కేసీఆర్ గ్రాఫ్ అమాంతంగా పెరగడానికి బీజం వేసింది కరీంనగరే. ఎక్కడైతే కేసీఆర్ కు రాజకీయ భవిష్యత్తుకు అగ్రపీఠం వేసిన కరీంనగర్ లోనే సభను విజయవంతం చేయడం ద్వారా బీ ఆర్ ఎస్ పనైపోయిందనే సంకేతాలు ప్రజల్లోకి పంపాలని బండి సంజయ్ యోచిస్తున్నారు. బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు.