Raj Thackeray: మహా రాజకీయాల్లో కీలక పరిణామం.. 20ఏళ్ల తర్వాత ఒకే వేదికపై ఠాక్రే సోదరులు

Uddhav Thackeray: విడిపోయిన అన్నదమ్ములు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే 20 ఏళ్ల తర్వాత ఒకే వేదికను పంచుకున్నారు. మహారాష్ట్రలో త్రిభాషా విధానం అమలుకు సంబంధించిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇది ప్రతిపక్షాల విజయంగా పేర్కొంటూ ఇవాళ ముంబయి వేదికగా ‘వాయిస్ ఆఫ్ మరాఠీ’ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన నేత రాజ్ ఠాక్రే కుటుంబసమేతంగా పాల్గొన్నారు. ఛత్రపతి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అన్నదమ్ములు 2005లో విడిపోయారు. అనంతరం దాదాపు 20 ఏళ్ల తర్వాత తిరిగి కలుసుకోవడం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారనుంది.
ఈ సందర్భం రాజ్ ఠాక్రే మాట్లాడూతూ.. కేంద్రంపై విమర్శలు చేశారు. ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవడం ద్వారా మన పిల్లలు సరైన విషయాలు నేర్చుకొనే అవకాశం లేకుండా పోతోందన్నారు. మోదీ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. దక్షిణ భారతదేశంలో చాలామంది సినీనటులు, రాజకీయ నేతలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నప్పటికీ తమ మాతృభాష తెలుగు, తమిళం వంటి భాషల విషయంలో ఎంతో గర్వంగా ఉంటారని తెలిపారు.
మహారాష్ట్ర నేతలు, ప్రజలకు తమ భాషపై అభిమానం ఉంటుందని పేర్కొన్నారు. తమకు హిందీ భాషపై వ్యతిరేకత ఎప్పుడూ లేదని రాజ్ అన్నారు. ఇతరులపై ఇంగ్లిష్ భాషను బలవంతంగా రుద్దాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తమ పూర్వీకులు మరాఠా సామాజ్రాన్ని ఎన్ని ప్రాంతాలకు విస్తరించినప్పటికీ ఎప్పుడు అక్కడి వారిపై మరాఠీని బలవంతంగా రుద్దలేదని రాజ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలపై త్రిభాషా సూత్రాన్ని ప్రయోగించాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికీ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, ఇతర హైకోర్టుల్లో అన్ని ఉత్తర్వులు ఆంగ్లభాషలోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధానాన్ని మహారాష్ట్రపై రుద్దాలని చూస్తే ఏం జరుగుతుందో ఇప్పటికైనా కేంద్రం తెలుసుకోవాలని హెచ్చరించారు.
తమను ఒకచోట చేర్చడం ఎవరికీ సాధ్యం కాలేదని, చివరికి బాల్ ఠాక్రే సైతం చేయలేకపోయిన పనిని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా చేశారని రాజ్ ఠాక్రే అన్నారు. అనుకోకుండానే ఆయన తమని ఒకే వేదిక పైకి తీసుకువచ్చారన్నారు. ఇకపై రాష్ట్ర ఐక్యత విషయంలో తాము ఎప్పటికీ ఒక్కటిగా ఉంటామని పేర్కొన్నారు.