YouTube Update: యూట్యూబ్ క్రియేటర్లకు జూలై 15 నుంచి కొత్త రూల్స్

Important Update from YouTube: యూట్యూబ్ క్రియేటర్లకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఈ సందర్భంగా పునరావృతమయ్యే కంటెంట్‌ను నియంత్రించేందుకు సంస్థ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రాంలో భాగంగా ఈ నెల 15 నుంచి కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. దీన్ని ప్రకారం యూట్యూబ్.. సృజనాత్మక, ఒరిజినల్ కంటెంట్‌ను మాత్రమే ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాపీ కంటెంట్ లేదా వీడియోలకు ఆదాయం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది.
రీయూజ్డ్ కంటెంట్‌ను తొలగించడంపై ఫోకస్..
దీంతోపాటు రీయూజ్డ్ కంటెంట్‌ను తొలగించడంపై ఫోకస్ చేసింది. యూట్యూబ్ అధికారిక సపోర్ట్ పేజీలో తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిజినల్ కంటెంట్‌ను ప్రోత్సహించిన ఛానెళ్లు మాత్రమే మానిటైజ్ అవుతాయని పేర్కొంది. మార్గదర్శకాలు కంటెంట్ క్రియేటర్లు తమ వీడియోల్లో నాణ్యత, సృజనాత్మకతను కాపాడుకోవాలని సూచిస్తున్నాయి. ఈ నూతన విధానంతో నిజమైన కంటెంట్ క్రియేటర్లను రక్షించడం, ప్లాట్‌ఫాం దుర్వినియోగాన్ని తగ్గించడం లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నారు.
టైటిల్స్ నిషేధం..
క్లిక్‌బైట్ : వీక్షకులను ఆకర్షించడానికి తప్పుదారి పట్టించే థంబ్‌నెయిల్స్ లేదా టైటిల్స్ నిషేధం
తక్కువ నాణ్యత : వీక్షకులకు ఎటువంటి విలువను అందించని వీడియోలు రద్దు
రీయూజ్ వీడియోలు : ఇతరుల కంటెంట్‌ను కాపీ చేయడం లేదా స్వల్ప మార్పులతో తిరిగి అప్‌లోడ్ చేసినా నో యూజ్
అతిగా ఎడిట్ చేసిన..
యూట్యూబ్ ప్రకారం కంటెంట్ అనేది విద్యాపరమైన లేదా వినోదాత్మక విలువను అందించాలి. కేవలం వీక్షణల కోసం సృష్టించబడిన వీడియోలు ఆమోదయోగ్యం కాదు. ఉదాహరణకు రియాక్షన్ మాషప్‌లు, ఏఐ జనరేటెడ్ స్లైడ్‌షోలు లేదా ఇతరుల కంటెంట్‌ను అతిగా ఎడిట్ చేసిన వెర్షన్ వంటి వీడియోలు మానిటైజేషన్‌కు అర్హత పొందవు. ఈ నెల 15 నుంచి అలాంటి కంటెంట్ మానిటైజ్ అవ్వదు. ఒరిజినల్ కంటెంట్‌ను సృష్టించే కంటెంట్ క్రియేటర్లు మాత్రమే మానిటైజేషన్‌కు అర్హులవుతారు.
మానిటైజేషన్‌కు అర్హత పొందే వీడియోలు ఈ కింది లక్షణాలను పాటించాలి..
విద్యాపరమైన వీడియోలు : వీక్షకులకు జ్ఞానం, అవగాహనను అందించే వీడియోలు
వినోదాత్మక వీడియోలు : సృజనాత్మకంగా, ఆకర్షణీయంగా ఉండే వీడియోలు
ఆథెంటిక్ వాయిస్, విజువల్స్ : ఒరిజినల్ కంటెంట్ ఉండాలి
మానిటైజేషన్ అర్హత ప్రమాణాలు..
యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌లో చేరడానికి కంటెంట్ క్రియేటర్లు కనీసం అర్హత ప్రమాణాలు పాటించాలి. 1,000 సబ్‌స్క్రైబర్లతోపాటు గత 12 నెలల్లో ఛానెల్ 4,000 వాచ్ అవర్స్ పూర్తి చేసుకోవాలి. యూట్యూబ్‌లో కొత్త రూల్స్ నాణ్యమైన కంటెంట్‌ను ప్రోత్సహించడానికి తీసుకున్న నిర్ణయమని నిపుణులు చెబుతున్నారు. ఇది నిజంగా ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్లకు గుడ్‌న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వారి సృజనాత్మకత, కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది.