G. Parameshwara Apologizes: నా మాటలకు ఎవరైనా మహిళలు బాధపడి ఉంటే క్షమించాలి: కర్ణాటక హోంమంత్రి

Karnataka Home Minister G.Parameshwara Apologizes to Women: పెద్దనగరాల్లో లైంగిక వేధింపులు సాధారణం అంటూ కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనపై పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా తన వ్యాఖ్యలపై పరమేశ్వర దిద్దుబాటు చర్యలకు దిగారు. తన మాటలకు మహిళలు ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు.
తప్పుగా అర్థం చేసుకున్నారు..
తాను చేసిన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారని హోంమంత్రి తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలు వక్రీకరించే అవకాశం మరికొందరికి ఇవ్వవనని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పారు. మహిళల భద్రతపై నిరంతరం ఆందోళన చెందే వారిలో తాను కూడా ఒకరిని అన్నారు. మహిళల క్షేమం కోసం నిర్భయ నిధులను సక్రమంగా వినియోగిస్తున్నానని వెల్లడించారు. తన మాటలకు ఎవరైనా మహిళలు బాధపడి ఉంటే క్షమించాలని కోరారు.
గతవారం ఘటన..
గతవారం సుద్దగుంటెపాల్య ప్రాంతంలోని ఓ వీధిలో ఇద్దరు యువతులు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వెనకనుంచి వచ్చి ఓ యువతిని అసభ్యంగా తాకి పరారయ్యాడు. ఏం జరుగుతుందోనని యువతులు భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విషయం బయటపడింది. దీంతో బెంగళూరు పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు అభ్యంతరం..
ఘటనపై పరమేశ్వర మాట్లాడుతూ.. బెంగళూరు వంటి పెద్దపెద్ద నగరాలల్లోని వీధుల్లో మహిళలపై ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయని వ్యాఖ్యానించారు. జరిగిన ఘటనపై పోలీసులు స్పందించారు. యువతిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తంచేశారు. మహిళలను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉన్నతస్థానంలో ఉండి ఇలా మాట్లాడటం సిగ్గుచేటని మండిపోతున్నారు. బీజేపీ నేతలు సైతం పరమేశ్వర మాటలపై తీవ్రంగా స్పందించారు.