Karnataka Elections: పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను పగలకొట్టిన గ్రామస్థులు.. కారణమేంటంటే?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. జిల్లాలోని మసబినల్ గ్రామంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎన్నికల సిబ్బంది ఈవీఎంలు, వీవీ ప్యాట్లను మారుస్తున్నారంటూ గ్రామస్థులు అధికారులపై దాడి చేశారు. ఈవీఎంలు , వీవీప్యాట్లను ధ్వంసం చేశారు.
ఈవీఎంలు మారుస్తున్నారనే..(Karnataka Elections)
గ్రామంలో ఉదయం నుంచి ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. అయితే ఓ పోలింగ్ కేంద్రంలోని సిబ్బంది ఓటింగ్‌ను మధ్యలోనే ఆపి ఈవీఎంలను తరలిస్తున్నారనే వార్త ఒక్కసారిగా బయటకొచ్చింది. దీంతో గ్రామస్తులు ఆగ్రహంతో పోలింగ్ కేంద్రంలోకి చొరబడ్డారు. అదే సమయంలో ముగ్గురు అధికారులు రెండు ఈవీఎంలను బయటకు తీసుకొచ్చి కారులో పెట్టారు. దీంతో గ్రామస్తులు పోలింగ్‌ను నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు వారిపై దాడికి చేశారు. అదే విధంగా కారును కూడా ధ్వంసం చేసి ఈవీఎంలను పగల గొట్టారు. ఈ ఘటనలో సిబ్బంది వాహనాలు, ఈవీఎంలు , వీవీప్యాట్లు ధ్వంసమయ్యాయి. ఘర్షణ నేపథ్యంలో పోలీసులు భాష్పవాయువు ప్రయోగించి ఆందోళన చేస్తున్నవారిని చెదర గొట్టారు.
ఎలాంటి అవకతవకలు లేవు
ఈ సంఘటనపై డిప్యూటీ కమిషనర్ విజయ్ మహంతేశ్ స్పందించారు. పోలింగ్ లో ఎలాంటి అవకతవకలు జరుగలేదన్నారు. సిబ్బందికి తీసుకెళ్లినవి అదనంగా ఉన్న ఈవీఎంలు మాత్రమే అని తెలిపారు. అత్యవరసర పరిస్థితుల్లో వినియోగించేందుకు అందుబాటులో ఉంచారన్నారు. కానీ, మసబినల్ వాటి అవరసరం లేకపోవడంతో మరో పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఇదే విషయాన్ని అధికారులు చెప్పాలనుకున్నా గ్రామస్థులు వినలేదన్నారు. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉందని.. ఓటింగ్ కొనసాగుతుందన్నారు. ఈ ఘటనలో 23 మందిని పోలీసులు అరెస్టు చేసినట్టు కర్ణాటక ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు.