Home / తప్పక చదవాలి
చండీగఢ్ మేయర్ ఎన్నికలో అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీజేపీకి చెందిన మనోజ్ సోంకార్ విజేతగా నిలిచారు. మొత్తం 36 ఓట్లకు గాను 16 ఓట్లు బీజేపీ దక్కించుకోగా ఆప్ పార్టీకి 12 ఓట్లు పోలయ్యాయి. ఎనిమిది ఓట్లు చెల్లని ఓట్లుగా ప్రిసైడింగ్ ఆఫీసర్ అనిల్ మాసి తేల్చడంతో ఆప్ పార్టీ బీజేపీపై మండిపడుతోంది.చండీగడ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్‌లు రెండు కలిసి పోటీ చేశాయి.
ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం మావోస్టులకు భద్రతా దళాలకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా.. మరో పద్నాలుగుమంది జవాన్లు గాయపడ్డారు.ఇదే ప్రాంతంలో 2021 నుంచి ఇప్పటి వరకు సుమారు 23 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఐజీ బస్తర్ పి సుందర్రాజ్ చెప్పారు.
తెల్లాపూర్‌లో దివంగత విప్లవ గాయకుడు గద్దర్ విగ్రహ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.విగ్రహానికి అవసరమైన భూమిని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారిక ప్రకటనలో తెలియజేసింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సత్యవేడు ఎమ్మల్యే కోనేటి ఆదిమూలం మంగళవారం తెలుగుదేశం జాతీయపార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. ఆయనకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్యవేడు నుంచి పోటీ చేయడానికి టికెట్ దక్కలేదు. దీనికి ప్రతిగా తిరుపతి నుంచి ఎంపీగా పోటీచేయమని చెప్పడంతో ఆయన షాక్ అయ్యారు.
ప్రభుత్వ రహస్యాలను లీక్ చేసిన కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది.పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్, వైస్ చైర్మన్ షా మహమూద్ ఖురేషీలకు సైఫర్ కేసులో పాకిస్థాన్‌లోని ప్రత్యేక కోర్టు మంగళవారం పదేళ్ల జైలు శిక్ష విధించింది.
తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీఖాన్ ల ప్రమాణస్వీకారానికి బ్రేక్ పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు వీరిచేత ప్రమాణస్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సమరశంఖాన్ని పూరించింది. ఇందులో భాగంగా శనివారం భీమిలి నియోజక వర్గం సంగివలస సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. సీఎం జగన్ ఈ సభకు హాజరై క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేసారు. రాబోయే ఎన్నికల యుద్దంలో ప్రతిపక్షాలు ఎన్ని వచ్చినా తాను సిద్దంగా ఉన్నానంటూ చెప్పారు. నేను సిద్దం మీరు సిద్దమా అంటూ కార్యకర్తలను ప్రశ్నించారు.
బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్‌ను హత్య చేసిన కేసులో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కి చెందిన 15 మంది వ్యక్తులకు మరణశిక్ష విధిస్తూ కేరళ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 డిసెంబర్లో రంజిత్ హత్యకు గురయ్యారు.
ఢిల్లీలోని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధికారిక నివాసంలో జరిగిన సోదాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండు బీఎండబ్ల్యూలు, కొన్ని నేరారోపణ పత్రాలు, రూ.36 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. సోరెన్ ఇంట్లో లేనందున ఈడీ బృందం అతన్ని ప్రశ్నించలేకపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం -యూఏపీఏ కింద సిమిపై నిషేధాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది.