Published On:

Vanajeevi Ramaiah Passed away: గుండెపోటుతో “పర్యావరణ హితుడు వనజీవి రామయ్య” కన్నుమూత..

Vanajeevi Ramaiah Passed away: గుండెపోటుతో “పర్యావరణ హితుడు వనజీవి రామయ్య” కన్నుమూత..

Padma Shri Vanajeevi Ramaiah Passed away at age of 85: పర్యావరణ హితుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మొక్కలను అమితంగా ప్రేమించే రామయ్య గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ఇవాళ తెల్లవారుజామున గుండెపోటు రావడంతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

 

వనజీవి రామయ్య.. కోటి మొక్కలు వాటి ప్రకృతి ప్రేమికుడిగా పేరు గాంచిన ఆయనను 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఆయన ఇంటిపేరునే వనజీవిగా మార్చుకొని జీవితమంతా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ కోసం పరితపించారు. దాదాపు ఆయన ఇప్పటివరకు కోటికిపైగా మొక్కలు నాటి చరిత్ర నెలకొల్పారు.

 

ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామస్తుడైన రామయ్య.. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేవారు. ఆ తర్వాత పాఠశాలలు, ఆస్పత్రులు, ఆలయ పరిసర ప్రాంతాల్లో వేల మొక్కలు నాటి అందరికీ మార్గం చూపించారు. ఈ సమయంలో వృక్షో రక్షతి రక్షిత: అంటూ ప్రచారం చేశారు.

 

వనజీవి రామయ్య మరణంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు కోటి మొక్కలు నాటడం గొప్ప విషయమన్నారు. వనజీవి రామయ్య మృతి తీరని లోటని , ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే వనజీవి మరణం బాధాకరమని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ఆయన చూపిన మార్గమే ప్రస్తుతం భావితరాలకు ప్రేరణగా ఉంటున్నాయన్నారు.

 

రామయ్య మృతిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోటి మొక్కలు నాటి వనజీవినే తన ఇంటిపేరుగా మార్చుకున్న గొప్ప పర్యావరణ హితుడు రామయ్య అని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ట్వీట్ చేశారు. అలాగే, ఆయన మరణంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి లోటని అన్నారు.