Last Updated:

Medical Student Suicide: అత్యంత విషమంగా వైద్య విద్యార్థిని ఆరోగ్యం.. ర్యాగింగే లేదన్న డీఎంఈ

వరంగల్‌ మెడికల్‌ కాలేజీ పీజీ స్టూడెంట్‌ ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. నిమ్స్‌లోని ఎమర్జెన్సీ వార్డులో వెంటిలేటర్‌పైన ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు నిమ్స్ డాక్టర్లు చెబుతున్నారు.

Medical Student Suicide: అత్యంత విషమంగా వైద్య విద్యార్థిని ఆరోగ్యం.. ర్యాగింగే లేదన్న డీఎంఈ

Medical Student Suicide: వరంగల్‌ మెడికల్‌ కాలేజీ పీజీ స్టూడెంట్‌ ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. నిమ్స్‌లోని ఎమర్జెన్సీ వార్డులో వెంటిలేటర్‌పైన ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు నిమ్స్ డాక్టర్లు చెబుతున్నారు.

ఆమె అవయవాలు దెబ్బతినడంతో పాటు బ్రెయిన్ డ్యామేజ్ అయిందని డాక్టర్లు చెప్పారు. పాయిజన్ ఇంజక్షన్‌ వల్లే ప్రీతి అపస్మారక స్థితిలోకి వెళ్లిందని స్పష్టం చేశారు. ఆమెను కాపాడేందుకు డాక్టర్‌ పద్మజా ఆధ్వర్యంలో 5గురు డాక్టర్ల టీమ్ తీవ్రంగా కష్టపడుతోంది.

 

రెండు సార్లు ఆగిన గుండె(Medical Student Suicide)

అనస్తేషియా, కార్డియాలజీ, న్యూరాలజీ, జనరల్ ఫిజిషియన్‌ డాక్టర్లు ప్రీతికి ఎప్పటికప్పుడు వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రీతి శరీరం ట్రీట్మెంట్ కు సహకరించడం లేదని, బీపీ, పల్స్‌ రేట్‌ కూడా రికార్డు కాలేని పరిస్థితి వచ్చిందని డాక్టర్లు తెలిపారు.

వరంగల్‌ నుంచి నిమ్స్‌కు తీసుకువచ్చే సమయంలో ప్రీతి గుండె రెండుసార్లు ఆగిపోయిందన్నారు.

అయితే, వెంటనే స్పందించిన డాక్టర్లు సీపీఆర్‌ చేసి మళ్లీ గుండె కొట్టుకునేలా చేశారని తెలిపారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ప్రస్తుతం ఏమి చెప్పలేమని నిమ్స్‌ డాక్టర్లు అంటున్నారు.

హైదరాబాద్‌ కు చెందిన ప్రీతి అనే అమ్మాయి.. కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది.

అయితే, సీనియర్ వైద్య విద్యార్థి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బాధిత విద్యార్ధిని ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు చేసిన కాలేజీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ప్రీతి బుధవారం మత్తు ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే.

వెంటనే అప్రమత్తమైన సహా విద్యార్థులు, వైద్య సిబ్బంది వరంగల్‌లోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఎంజీఎంకు మార్చారు.

బాధితురాలి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన వరంగల్ నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు.

ప్రస్తుతం నిమ్స్‌లో ప్రీతికి చికిత్స అందిస్తున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు స్పందించి ఉంటే ఇలా జరిగేది కాదని అక్కడి విద్యార్ధులు అంటున్నారు.

సీనియర్ పీజీ వైద్య విద్యార్థి వేధింపులే ఈ ఘటనకు కారణమని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వేధింపులకు గురిచేసిన వైద్య విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

మాకు న్యాయం కావాలి: ప్రీతి తండ్రి

అయితే ఈ ఘటనపై ప్రీతి తండ్రి స్పందించారు. ప్రీతి ని సైఫ్‌ అనే సీనియర్‌ విద్యార్థి వేధించినట్లు ఆయన తెలిపారు.

ఇదే విషయం ప్రీతి తమకు చెప్పిందని.. తమ కూతురికి ధైర్యం చెప్పి కాలేజీకి పంపించామని పేర్కొన్నారు. ర్యాగింగ్ పై పోలీసులకు ఇది వరకే సమాచారం ఇచ్చామన్నారు.

ఈ విషయం యూనివర్సిటీ అధికారులకు తెలిసిన తర్వాత కూడా.. వారు తమనే మందలించారని ఆవేదన వ్యక్తం చేశారు.

అకస్మాత్తుగా ప్రీతి ఫోన్‌ నుంచి కాల్ వచ్చిందని.. తను అపాస్మాకర స్థితిలో ఉన్నట్లు తెలియగానే ఆస్పత్రికి వెళ్లినట్లు తెలిపారు.

కరోనా సమయంలో ప్రీతి సేవలు అందించిందని.. అలాంటిది తమ కూతురు ఇలా చేస్తుందని ఊహించలేదని అన్నారు.

కాలేజీ కి చెడ్డ పేరు వస్తుందనే హైదరాబాద్ నిమ్స్ కు తరలించారన్నారు. వరంగల్ గొడవ జరుగుతుందని, కావాలనే నిమ్స్ కు తీసుకువచ్చారని చెప్పారు.

తమకు న్యాయం కావాలని ఆయన డిమాండ్ చేశారు. వేధింపులకు పాల్పడుతున్న సైఫ్ అనే స్టూడెంట్ తో మాట్లాడతానని చెప్పినా.. మళ్లీ ఇబ్బందులు వస్తాయని ప్రీతి వద్దని చెప్పిందన్నారు.

తక్కువ మార్కులు వేస్తారిన భయపడింది అని చెప్పారు. చదువుల్లో ముందుండే తమ కూతురు.. వేధింపులు ఎక్కువ కావడం వల్లే ఇలా చేసిందని చెప్పుకొచ్చారు.

ఈ ఘటనకు కారణమైన సైఫ్ ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఎలాంటి ర్యాగింగ్ జరగలేదు: డీఎంఈ రమేశ్ రెడ్డి

వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కళాశాల లో ఎలాంటి ర్యాగింగ్‌ జరగలేదని తెలంగాణ వైద్య విద్య డైరెక్టర్‌(డీఎంఈ) రమేశ్‌రెడ్డి స్పష్టం చేశారు.

నిమ్స్‌కు వెళ్లిన ఆయన.. వరంగల్‌లో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్యవిద్యార్థినికి కొనసాగుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం విద్యార్థిని ప్రీతి ఆరోగ్యం విషమంగానే ఉందని ఆయన తెలిపారు. వెంటిలేటర్‌పై ఆమెకు చికిత్స కొనసాగుతోందన్నారు.

కేఎంసీలో ర్యాగింగ్‌ జరగలేదన్నారు. విద్యార్థిని, సీనియర్‌ మధ్య ఉండేవి మనస్పర్థలు మాత్రమేనని చెప్పారు.

దీనిపై ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చారని.. ఈ ఘటనపై ఇప్పటికే కమిటీని నియమించామని తెలిపారు. కమిటీ నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు.

విద్యార్థిని కాపాడేందుకు నిమ్స్‌ వైద్యులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని రమేశ్ రెడ్డి చెప్పారు.

ఘటనపై నలుగురితో కమిటీ ఏర్పాటు..

పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటైంది.

నలుగురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌ నియమించారు.

కమిటీ నివేదికను రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ రమేశ్‌రెడ్డికి సమర్పించనున్నారు.