Ameenpur Case Twist: ముగ్గురు పిల్లలను చంపిన కసాయి తల్లి.. కొంపముంచిన టెన్త్ గెట్ టూ గెదర్ పార్టీ

Big Twist In Ameenpur Food Poison Case: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన ముగ్గురు పిల్లల ఘటనలో సభ్య సమాజం తలదించుకునే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియుడి మోజులో ఏకంగా తన కడుపున పుట్టిన పిల్లలను పెరుగు అన్నంలో విషం కలిపి తానే చంపేసి ఏమీ తెలియనట్లుగా నాటకం ఆడింది. ఓ కసాయి తల్లి చేసిన పనికి అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ రాఘవేంద్ర కాలనీలో చెన్నయ్య, రజిత దంపతులు ఉంటున్నారు. వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు జన్మించారు. పెద్ద కుమారుడు సాయికృష్ణ(12), కూతురు మధుప్రియ(10), చిన్న కుమారుడు గౌతమ్(8)తో కలిసి అక్కడే ఉంటున్నారు. రజిత అలియాస్ లావణ్య స్థానికంగా ఓ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తుండగా.. ఆమె భర్త అవురిజింతల చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
అయితే, సజావుగా సాగుతున్న వీరి జీవితంలో టెన్త్ గెట్ టూ గెదర్ కొంపముంచింది. అప్పటివరకు ఎలాంటి సమస్య లేకుండా మంచిగా సాగుతున్న వీరి సంసారంలోకి అక్రమ సంబంధం చిచ్చు పెట్టింది. కాగా, ఇటీవల లావణ్య చదివిన పాఠశాలలో పదోతరగతి పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు. ఈ గెట్ టూ గెదర్ పార్టీకి వెళ్లిన లావణ్య(38)కు తన క్లాస్‌మెట్‌తో మళ్లీ పరిచయం ఏర్పడింది. దీంతో ఒకరినొకరు నంబర్లు మార్చుకున్నారు. అయితే నిత్యం ఇద్దరు మాట్లాడుకునేవారు. ఇలా కొన్నిరోజుల పాటు సాగిన వీరి పరిచయం చివరికి వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఇదిలా ఉండగా, కొంతకాలంగా వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుండగా.. ప్రియుడితో కలిసి తల్లి రజిత దారుణానికి ఒడిగట్టింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారనే కారణంతో భర్తతో పాటు పిల్లలను చంపాలని నిర్ణయించుకుంది. ప్రియుడి మోజులో తన పిల్లలపై ప్రేమ పూర్తిగా తగ్గిపోయింది. చివరికి తన ప్రియుడితో ఉండాలని నిర్ణయం తీసుకొని భర్త, పిల్లలను చంపాలని ప్లాన్ చేసింది.
ఇందులో భాగంగానే, రజిత తన ముగ్గురు పిల్లలకు రాత్రి పెరుగు అన్నం తినిపించింది. ఇందులో విషం కలిపి తినిపించడంతో పిల్లలు విగతజీవులుగా పడిపోయారు. తన భర్త వచ్చేసరికి తనకు కడుపునొప్పి వస్తుందని నాటకం ఆడింది. అయితే పిల్లలకు అన్నం పెట్టే సమయంలో భర్తకు ఫోన్ కాల్ వస్తే పని ఉందని పప్పుతో మాత్రమే తిని బయటకు వెళ్లడంతో బతికిపోయాడు.
అయితే, ఈ కేసులో తొలుత పిల్లల తండ్రి చెన్నయ్య(40)ను అనుమానించారు. ఆ తర్వాత విచారణలో స్థానికులను అడగగా భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు మరింత లోతుగా విచారించారు. ఈ విచారణలో చెన్నయ్య ప్రమేయం లేదని తెలుసుకున్న పోలీసులు రజితను అడగడంతో ఆమె కంగారు పడింది. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. పదో తరగతి చదువుతున్న సమయంలో తన స్నేహితుడు మళ్లీ కలిశాడని ఒప్పుకుంది. రోజూ చాటింగ్,ఫోన్లు మాట్లాడేవాళ్లమని చెప్పింది. అది చివరికి అక్రమ సంబంధానికి దారి తీసిందని, భర్తతో పాటు పిల్లల అడ్డు తొలగిపోతే ప్రియుడితో వెళ్లిపోవచ్చని విషం కలిపినట్లు పోలీసులు నిర్ధారించారు.