Harish Rao: కాళేశ్వరం కమిషన్ ముందుకు హరీశ్ రావు .. 45 నిమిషాలపాటు విచారణ
Kaleshwaram Commission: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కాళేళ్వరం కమిషన్ విచారణ ముగిసింది. బీఆర్కే భవన్ లో సుమారు 45 నిమిషాలపాటు ఆయనను కమిషన్ విచారించింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కోరింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అప్పటి నీరుపారుదల శాఖ మంత్రిగా హరీశ్ రావు ఉన్నందున నిర్మాణానికి సంబంధించిన కీలక విషయాలను హరీశ్ రావు నుంచి తెలుసుకున్నట్టు తెలుస్తోంది.
కాళేశ్వరం డిజైన్లు, బ్యారేజీల ఎంపికపై జస్టిస్ సీపీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. అదే విధంగా ప్రాజెక్ట్ కోసం నిధుల సమీకరణ గురించి కూడా ప్రశ్నించినట్టు సమాచారం. ప్రాజెక్ట్ కు సంబంధించి 45 నిమిషాలపాటు సమగ్రంగా వివరాలను కమిషన్ అడిగినట్టు తెలుస్తోంది. కాగా కమిషన్ అడిగిన ప్రశ్నలకు హరీశ్ రావు సమాధానం ఇచ్చారని టాక్. మహారాష్ట్ర, సీడబ్ల్యూసీ అభ్యంతరాల వల్లనే తమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరానికి ప్రాజెక్ట్ మారినట్టు చెప్పారట. ప్రాజెక్ట్ టెక్నికల్ అంశాల్లో ఇంజనీర్లదే కీలక నిర్ణయమని కమిషన్ కు సమాధానమిచ్చారని తెలుస్తోంది. కాళేశ్వరం నిర్మాణం కేబినెట్ నిర్ణయం మేరకే జరిగిందని వెల్లడించారట. కాగా కాళేశ్వరం విచారణపై మరికాసేపట్లో హరీశ్ రావు మీడియాతో మాట్లాడనున్నారని సమాచారం.