Harvard University on HYD Metro: హైదరాబాద్ మెట్రోకు గుర్తింపు.. హర్వర్డ్ బిజినెస్ రివ్యూలో ప్రచురణ!

Harvard University on Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకు దేశవ్యాప్తంగానే కాక, ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు హైదరాబాద్ ప్రజలకు విలువైన సేవలను అందిస్తోంది. మొత్తం మూడు మార్గాలతో దాదాపు 65 కి.మీ మేర మెట్రోను ఎల్ అండ్ టీ కంపెనీ నిర్మించింది. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ అందరితో ప్రశంసలు పొందుతోంది.
తాజాగా హైదరాబాద్ మెట్రోకు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీ ఈ ప్రాజెక్టుపై పరిశోధనలు నిర్వహించింది. అనంతరం హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో ఆర్టికల్ ప్రచురించింది. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విజయవంతమైన పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించిన ప్రాజెక్టులలో హైదరాబాద్ మెట్రో ఒకటిగా గుర్తింపు లభించింది. దీంతో హైదరాబాద్ మెట్రో రైలుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. కాగా ప్రాజెక్టు నిర్మాణం తొలిదశలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని హార్వర్డ్ యూనివర్శిటీ తెలిపింది. భూసేకరణలు, రాజకీయ ఒత్తిళ్లు, ప్రజా నిరసనలు వంటి ప్రధాన సవాళ్లను అధిగమించడంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అద్భుతంగా పని చేశారని అభినందించింది.
భారత్ లో మెట్రోను విస్తరించేందుకు అవలంభించిన వ్యూహాలు, పలు శాఖల మధ్య సమన్వయం, ఆధునిక సాంకేతికత, దౌత్యపూరిత చర్చలు వంటి అంశాలు మెట్రోకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించేందుకు సాయం చేశాయని హార్వర్డ్ యూనివర్శిటీ తెలిపింది. ప్రాజెక్టు అవలంబించిన ఆర్థిక విధానాలు, ఉన్నత ఇంజనీరింగ్ పరిష్కారాలు, సమర్థవంతమైన చర్చల వ్యూహం ద్వారా అవరోధాలను అధిగమించారని చెప్పింది. ఇది భారత్ కు మరో గర్వకారణమైన క్షణం అంటూ హైదరాబాద్ మెట్రోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కేస్ స్టడీని హార్వర్డ్ బిజినెస్ పబ్లిషింగ్ https://hbsp.harvard.edu/product/ISB477-PDF-ENG వెబ్ సైట్ లో అందుబాటులో పెట్టారు.