TG TET 2025 Starts from Today: నేటి నుంచి టెట్ పరీక్షలు.. జూన్ 30 వరకు నిర్వహణ
Telangana TET 2025 Starts from Today: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2025) పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈనెల 30 వరకు రోజుకు రెండు సెషన్లలో ఆన్ లైన్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా 66 కేంద్రాలను కేటాయించింది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. టెట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,83,653 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 63,261 మంది అభ్యర్థులు పేపర్ 1కు, 1,20,392 మంది పేపర్ 2 కి దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 15 వేల మంది అభ్యర్థులు రెండు పేపర్లు రాయనున్నారు.
పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ జరుగుతాయి. షెడ్యూల్ ప్రకారం జూన్ 18, 19, 20,23, 24,27,28,29,30 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 18,19,24 తేదీల్లో మొదటి షిఫ్టులో మాత్రమే పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 28,29,30 తేదీల్లో పేపర్ 2 పరీక్షలు జరుగుతాయి. మొత్తం 9 రోజులు 16 షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను గంట ముందుగానే పరీక్ష హాల్ లోకి అనుమతిస్తున్నారు. హాల్ టికెట్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డును అభ్యర్థులు తమ వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు.