Last Updated:

Tirumala : టీటీడీ భక్తులకు గుడ్‌న్యూస్‌.. అన్నప్రసాదం మెనూలో అదనంగా ‘వడ’

Tirumala : టీటీడీ భక్తులకు గుడ్‌న్యూస్‌.. అన్నప్రసాదం మెనూలో అదనంగా ‘వడ’

Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో గురువారం నుంచి భక్తులకు అదనంగా వడ ప్రసాదాన్ని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ప్రారంభించారు. ముందుగా వడలను స్వామి, అమ్మవార్ల చిత్రపటాల వద్ద ఉంచి చైర్మన్, అధికారులు పూజలు నిర్వహించారు. అనంతరం బీఆర్ నాయుడు భక్తులకు స్వయంగా వడ్డించారు. వడలు రుచిగా ఉన్నాయంటూ భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. తాను టీడీపీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్నప్రసాదం మెనూలో భక్తులకు అదనంగా ఒక పదార్థం వడ్డించాలని ఆలోచన కలిగిందని చెప్పారు.

సీఎం చంద్రబాబు అంగీకారంతో..
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. సీఎం అంగీకారంతో వడల వడ్డింపును ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటికే భక్తులకు నాణ్యమైన దినుసులతో రుచికరమైన అన్న ప్రసాదాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు పంపిణీ చేసే వడ తయారీలో శెనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, సోంపును ఉపయోగించనున్నట్లు వెల్లడించారు.

రోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 వరకు..
అన్న ప్రసాద కేంద్రంలో ప్రతిరోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 వరకు 35 వేల వడలను భక్తులకు వడ్డించనున్నట్లు వివరించారు. భవిష్యత్‌లో ఈ సంఖ్యను మరింతగా పెంచి భక్తులకు రుచికరం, నాణ్యమైన భోజనం అందిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి: