Air Pollution: పుట్టే బిడ్డలపై వాయుకాలుష్య ప్రభావం.. జాగ్రత్తలు తీసుకోండి ఇలా!
Air Pollution Effects On Pregnant Lady And Fetus: వాయు కాలుష్యం మనిషి జీవితంపై అధిక ప్రభావం చూపనుంది. అందులో భాగంగా అకాల జననాలు ఏర్పడతాయని రిసెర్చ్ చెబుతుంది. అంటే నెలలు నిండకుండాను పిల్లలు పుడతారని అర్థం.
ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ‘కార్టెక్సోలోన్’ మరియు ‘లైసోపీఈ )’ అనే రెండు పదార్థాలను గుర్తించింది, ఇవి అకాల జననాల ప్రమాదాన్ని పెంచుతున్నట్లు గుర్తించారు.
మనిషి శ్వాస తీసుకోకుండా బతకలేదు. ఆ శ్వాసే గాలి. గాలిని లోపలికి పీలుస్తూ బయటకు వదులుతూ ఉంటేనే మనిషి బతకగలుగుతాడు. అదే గాలి కాలుష్యమైనప్పుడు మనిషి మనుగడ శూన్యమవుతుంది. అందులో భాగంగానే వాయు కాలుష్యం అనేది తీవ్రమైన ఆరోగ్య ప్రభావాలను కలిగించే పర్యావరణ సమస్య. క్యాన్సర్లు మరియు ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
వాయు కాలుష్యం వలన ముఖ్యంగా…. గర్భిణీ స్త్రీలకు మరియు పిండానికి కూడా హానికరం కలుగనుందని రిపోర్టులు చెబుతున్నాయి. గర్భధారణ సమయంలో సూక్ష్మ కణ పదార్థం, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలను పీల్చడం వలన అనేక రకాల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలి అధ్యయనం ప్రకారం.. అకాల ప్రసవం వాయు కాలుష్యంతో ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. పరిశోధకులు వాయు కాలుష్యానికి గురైన గర్భిణీ స్త్రీల రోజువారి ప్రక్రియను అధ్యయనం చేసి, అకాల ప్రసవాల ప్రమాదాన్ని అంచనా వేశారు.
“వాయు కాలుష్యం, అకాల జననం మధ్య సంబంధం ఉంది, మొదటిసారిగా మేము వివరణాత్మకంగా పరిశీలించగలిగాము, అవి ప్రతికూల జనన ఫలితాల ప్రమాదంలో ఎలా ప్రతిబింబిస్తాయో గుర్తించగలిగాము” అని ఎమోరీ విశ్వవిద్యాలయంలో పర్యావరణ ఆరోగ్య అసోసియేట్ ప్రొఫెసర్ ప్రధాన రచయిత డోంఘై లియాంగ్ అన్నారు.
వాయు కాలుష్యం వలన నెలలు నిండకుండానే డెలివరీ కావడం, దీంతోపాటు తక్కువ బరువు గల బిడ్డలు పుట్టడం జరుగుతుంది. కాలుష్య పూరితమైన వాయువులు పిండం పెరుగుతున్నప్పుడు అందులో చేరి పిండానికి సరైన పోషకాలు అందకుండా చేస్తాయి. దీంతో పుట్టే పిల్లల్లో సమస్యలు తలెత్తుతాయి.
గర్భధారణ సమయంలో వాయు కాలుష్యం యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి, ఇక్కడ కొన్ని చిట్కాలను ఇస్తున్నాము..
- మీ ప్రాంతంలో గాలి నాణ్యత సూచికను తెలుసుకోండి.
- కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగకుండా ఇంట్లోనే ఉండండి.
- ఎయిర్ ప్యూరిఫైయర్‌లను ఇన్‌స్టాల్ చేయడం, క్రమం తప్పకుండా శుభ్రపరచడం ద్వారా ఇండోర్ కాలుష్యం లేకుండా చూసుకోండి.
- భారీగా ట్రాఫిక్ ఉన్న రోడ్లు మరియు పారిశ్రామిక ప్రాంతాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.
- వాయు కాలుష్య కారకాల యొక్క కొన్ని హానికరమైన ప్రభావాలను తగ్గించడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తినండి.