Last Updated:

AP Annual Budget: ఏపీ వార్షిక బడ్జెట్‌.. చంద్రబాబు, మంత్రులు ఏమన్నారంటే?

AP Annual Budget: ఏపీ వార్షిక బడ్జెట్‌.. చంద్రబాబు, మంత్రులు ఏమన్నారంటే?

AP CM Chandrababu, Ministers Statemets Sbout AP annual budget: ఏపీ శాసనసభలో రూ.3.22లక్షల కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమర్పించారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.48,340 కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు.

ఈ బడ్జెట్‌లో బీసీల సంక్షేమం కోసం రూ.47,456 కోట్లు కేటాయించగా.. పాఠశాల విద్యాశాఖ – రూ.31,805 కోట్లు, ఎస్సీల సంక్షేమం- రూ.20,281 కోట్లు, ఎస్టీల సంక్షేమం- రూ.8,159 కోట్లు, అల్ప సంఖ్యాకులు – రూ.5,434కోట్లు, వ్యవసాయ అనుబంధ సంఘాలు – రూ.13, 487 కోట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్ షిప్ – రూ.3,377 కోట్లు, మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు – రూ.4,332 కోట్లు, వైద్య, ఆరోగ్య కుటుంబ శాఖ – రూ.19,264 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖ – రూ.18,847 కోట్లు, జలవనరులశాఖ – రూ.18,019 కోట్లు, మున్సిపాలటీ, పట్టణాభివృద్ధి శాఖ – రూ.13,862 కోట్లు, పౌరసరఫరాలశాఖ – రూ.3,806 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్యశాఖ – రూ.3,156 కోట్లు, నైపుణ్యాభివృద్ధి శాఖ – రూ.1,228 కోట్లు, ఉన్నత విద్యాశాఖ – రూ.2,506 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు – రూ.27,518 కోట్లు, ఆర్‌టీజీఎస్ – రూ.101 కోట్లు, పోలవరం – రూ.6,705 కోట్లు, గృహ మంత్రిత్వ శాఖ – రూ.8,570 కోట్లు, జలజీవన్ మిషన్ – రూ.2,800 కోట్లు, దీపం 2.0 పథకం – రూ.2,601 కోట్లు, మత్స్యకార భరోసా – రూ.450 కోట్లు, స్వచ్ఛాంద్ర కోసం రూ. రూ.820 కోట్లు, మధ్యాహ్న భోజన పథకం – రూ.3,486 కోట్లు, ఆదరణ పథకం కోసం రూ.1000 కోట్లు కేటాయించారు.

బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత ఆర్థిక శాఖ  మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు. సవాళ్లను అధిగమించడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని అన్నారు. గత ప్రభుత్వ విధ్వంస పాలన కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదైలైందన్నారు. కనీసం జీతాలు కూడా చెల్లించలేని స్థితికి వెళ్లిందన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం సవాల్‌తో కూడుకుని ఉందన్నారు. కానీ దీనిని ఎలా అధిగమించాలో సీఎం చంద్రబాబుకు బాగా తెలుసని అన్నారు.

అయితే ‘తల్లికి వందనం’ పథకం అమలుకు ఈ ఏడాది రూ.9,407 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి రూ.15వేల ఆర్థిక సాయం అందించినున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లో 1 నుంచి 12 చదువుతున్న విద్యార్థులకు వర్తిస్తుందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ ఉచితంగా విద్యుత్ అందజేస్తామన్నారు.

రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఉత్తమ బడ్జెట్ ప్రవేశపెట్టామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో ఐదేళ్లలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు. ఇలాంటి ఇబ్బందుల్లోనూ ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చేలా బడ్జెట్ రూపొందించామన్నారు. ఈ బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలంటే పనితీరులో మార్పులు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య గ్రూప్ రాజకీయాలు ఉండొద్దని, కో ఆర్డినేషన్ ఉండేలా చూసుకోవాలన్నారు.