BAC meeting: వైసీపీ నేతలకు అచ్చెన్న కౌంటర్.. ఆసక్తికరంగా బీఏసీ సమావేశం
ఏపీ అసెంబ్లీ సమావేవాలు గురువారం ప్రారంభమైన నేపధ్యంలో సభా నిర్వహణ పైన స్పీకర్ తమ్మినేని సీతారాం బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ (బీఏసీ) ఏర్పాటు చేసారు. ప్రభుత్వం నుంచి సీఎం జగన్ తో సహా శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి బుగ్గన, బీఏసీలో సభ్యులుగా ఉన్న మంత్రులు హాజరయ్యారు.
Amaravati: ఏపీ అసెంబ్లీ సమావేవాలు గురువారం ప్రారంభమైన నేపధ్యంలో సభా నిర్వహణ పైన స్పీకర్ తమ్మినేని సీతారాం బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ (బీఏసీ) ఏర్పాటు చేసారు. ప్రభుత్వం నుంచి సీఎం జగన్ తో సహా శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి బుగ్గన, బీఏసీలో సభ్యులుగా ఉన్న మంత్రులు హాజరయ్యారు. కాగా, టీడీపీ నుంచి అచ్చన్నాయుడు హాజరయ్యారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు అయిదు రోజుల పాటు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు.
ఈ సందర్బంగా వైసీపీ నేతలకు, అచ్చెన్నాయుడికి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. సభలో అనవసరంగా గందరగోళం సృష్టించడం ఏంటంటూ అచ్చెన్నను సీఎం జగన్ ప్రశ్నించారు. ఏ అంశం మీదనైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని సీఎం తెలిపారు. సభలో మేరుగ నాగార్జున చేసిన కామెంట్లను అచ్చెన్న ప్రస్తావించారు. పుట్టుకల గురించి విమర్శలేంటని ప్రశ్నించారు. కృష్ణా జిల్లా సమావేశంలో బచ్చుల అర్జునుడు వ్యక్తిగత కామెంట్లు చేయలేదా అంటూ శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించగా కొడాలి నాని ఏం కామెంట్లు చేశారో చూడలేదా అని అచ్చెన్న కౌంటర్ ఇచ్చారు. కుప్పంలో ఓటమిని తట్టుకోలేక తన కుటుంబ సభ్యులను ఏదో అన్నారని చంద్రబాబు చెప్పారని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు స్క్రిప్టును అయ్యన్నపాత్రుడు మాట్టాడారని మంత్రి జోగి రమేష్ అనగా వైపీపీ నేతల కామెంట్లను జగన్ రాస్తున్నట్లు తాము అనలేదని అచ్చెన్న స్పష్టం చేసారు.
మీ పార్టీ కార్యాలయాన్ని మీరే ధ్వంసం చేసుకున్నారని శ్రీకాంత్ రెడ్డి అనగా మా కార్యాలయాన్ని మేమేందుకు ధ్వంసం చేసుకుంటామని, చెప్పేదానికి అర్ధం ఉండాలి కదా అని అచ్చెన్న కౌంటర్ వేశారు. అయ్యన్నపాత్రుడు కామెంట్లు చేశారు కాబట్టే చంద్రబాబు ఇంటి వద్దకు వచ్చానని జోగి రమేష్ అనగా అయ్యన్న కామెంట్లు చేస్తే, ఆయనను తప్పు పట్టాలి కానీ, ఏకంగా చంద్రబాబు ఇంటి వద్దకు రావడమేంటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. సభలో గొడవ చేయకుండా సహకరించాలని సీఎం జగన్ కోరారు. మీరు ఒకటంటే మా వాళ్ళు పది మాటలు అనగలరు ఎందుకంటే మేము 151 మందిమి ఉన్నామని జగన్ అన్నారు.