Tree felling on AU campus: ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో చెట్ల కొట్టివేతను తక్షణమే నిలిపేయాలి.. ఏపీ హైకోర్టు ఆదేశాలు
ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో చెట్ల కొట్టివేతను తక్షణమే నిలిపేయాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.
Andhra University: ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో చెట్ల కొట్టివేతను తక్షణమే నిలిపేయాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఏయూ పరిధిలోని 70 ఎకరాల్లో విస్తరించి ఉన్న 1500 చెట్లను కూల్చివేశారని, అందుకు అటవీశాఖ అధికారుల అనుమతి లేదని, వాల్టా చట్ట నిబంధనలకు విరుద్ధంగా కొట్టేశారని పేర్కొంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ వేశారు, ఈ పిల్ విచారణ సందర్బందంగా చెట్ల కొట్టివేతను తక్షణమే నిలిపేయాలని కోర్టు ఆదేశించింది.
విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో చెట్ల కొట్టివేతను తక్షణమే నిలిపేయాలని అక్కడి అధికారులకు హైకోర్టు తేల్చిచెప్పింది. చెట్ల కూల్చివేతకు అనుమతులు ఉన్నాయా? అని ప్రశ్నించింది. ఇక మీదట చెట్లను కూల్చోద్దంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్ర, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
ఏయూ పరిధిలోని 70 ఎకరాల్లో విస్తరించి ఉన్న 1500 చెట్లను కూల్చివేశారని, అందుకు అటవీశాఖ అధికారుల అనుమతి లేదని, వాల్టా చట్ట నిబంధనలకు విరుద్ధంగా కొట్టేశారని, కుంటలు, నీటి ప్రవాహ ప్రాంతాలను పూడ్చి వేస్తున్నారని పేర్కొంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ వేశారు . సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపించారు. ఏయూలో సహజ సిద్ధంగా ఉన్న నీటి ప్రవాహ ప్రాంతాన్ని పూర్చొద్దని హైకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని గుర్తుచేశారు. వాల్టా చట్ట నిబంధనలకు విరుద్ధంగా చెట్లను కూల్చేస్తున్నారన్న.. వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. తక్షణం ప్రక్రియను నిలిపేయాలని అధికారులు ఆదేశించింది.