GHMC Council: రసాభాసగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీ.. ఉద్రికతల మధ్యే రూ.8,440 కోట్ల బడ్టెట్ ఆమోదం
GHMC Council Meeting: జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైంది. అయితే సమావేశం మొదలైన వెంటనే ప్రజాసమస్యలపై మాట్లాడాలని బీఆర్ఎస్ పట్టుబట్టటంతో సమావేశంలో రచ్చ మొదలైంది. దీంతో బీఆర్ఎస్ సభ్యులు మేయర్‌కి వ్యతిరేకంగా ఆందోళనకు దిగటంతో బాటు పోడియం దగ్గరకు దూసుకెళ్లి.. పేపర్లు చించి మేయర్‌పైకి విసిరారు. ఈ క్రమంలో హస్తం నేతలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీంతో ఈ తీవ్ర గందరగోళం మధ్యనే 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.8,440 కోట్ల బడ్జెట్‌ను ఆమోదిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు.
సాగని ప్రశ్నోత్తరాలు..
బడ్జెట్ ఆమోదం తర్వాత మేయర్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. అయితే, ఈ సమయంలోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కారుపార్టీ సభ్యులు మేయర్ పోడియంను చుట్టుముట్టి పెద్దగా నినాదాలు చేశారు. తమ గుర్తుమీద గెలిచి పార్టీ ఫిరాయించిన నేతకు వ్యతిరేకంగా వారు మాట్లాడుతుండటంతో మేయర్ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా వారు వెనక్కి తగ్గకపోవటంతో జీహెచ్ఎంసీ సెక్షన్ 89/1 ప్రకారం బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. అయితే, సభ నుంచి తమను బయటకు పంపడంతో వారంతా జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అరెస్ట్ చేశారు.
ఇదేనా ప్రజాపాలన: బీఆర్ఎస్
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను రాష్ట్రంలో అమలుకావడం లేదని, గ్రేటర్ హైదరాబాద్‌లో నిధులు ఎక్కడిక్కడ దుర్వినియోగం అవుతున్నాయని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆరోపించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగట్లేదని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఇదేంటని నిలదీస్తే తమను సమావేశం నుంచి బహిష్కరించారని వాపోయారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన నడుస్తోందనీ, చర్చ జరగకుండా బడ్జెట్ ఆమోదించడం ప్రజాస్వామిక విధానం కాదన్నారు.
రచ్చ చేయాలనే వచ్చారు: కాంగ్రెస్
కాగా, బీఆర్ఎస్ నేతలు సమావేశంలో రచ్చ చేయాలని ముందే నిర్ణయించుకున్నారని కాంగ్రెస్ విమర్శించింది. కావాలనే తమ సభ్యుల మీద కారు పార్టీ నేతలు దాడిచేశారని, మేయర్ మీదా కాగితాలు చించి విసిరేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగరాభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందించాల్సింది పోయి, ఇలా చేయటమేంటని వారు నిలదీశారు.
పాత కాగితాలపై కొత్త లెక్కలు
కాగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలూ కలిసి కొత్త నాటకం ఆడుతున్నాయని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. వీరి కుట్ర కారణంగానే రూ. 8,440 కోట్ల బడ్జెట్ చర్చ లేకుండానే ఆమోదం పొందిందని వారు చెప్పుకొచ్చారు. గత సంవత్సరం పెట్టిన బడ్జెట్ నిధులు ఖర్చు చేయకుండానే అవే కాగితాలపై అంకెలు మార్చి గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు చెబుతామని కమలనాథులు పేర్కొన్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస ప్రజావసరాలను కూడా సరిగ్గా నిర్వహించటం లేదని, తమ డివిజన్లకు నిధులు కేటాయించటం లేదని ఆరోపించారు. అనంతరం భిక్షాటన చేస్తూ బీజేపీ కార్పొరేటర్లు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ పరిస్థితి ఘోరంగా ఉందని విమర్శించారు.