Last Updated:

GHMC Council Meeting: నేడే బల్దియా బడ్టెట్ భేటీ.. జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీపై సర్వత్రా ఆసక్తి

GHMC Council Meeting: నేడే బల్దియా బడ్టెట్ భేటీ.. జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీపై సర్వత్రా ఆసక్తి

GHMC Council Meeting Today Discussion On Budget Proposal: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి సర్వం సిద్ధమైంది. నేటి ఉదయం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్తాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే పార్టీల వారీగా సమావేశాలు నిర్వహించుకుని తమ వ్యూహాలకు పదునుపెట్టుకున్న పార్టీలు నేటి సమావేశంలో ప్రశ్నల వర్షం కురిపించనున్నాయి. ఇక.. కౌన్సిల్​లో ప్రశ్నించడానికి కార్పొరేటర్లు 125 ప్రశ్నలివ్వగా, అధికారులు 21 ప్రశ్నలకే ఆమోదం తెలిపారు.

మీటింగ్ ఎజెండా ఇదే
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.8440 కోట్ల నూతన బడ్జెట్‌తో పాటు 2024-25లో ప్రవేశపెట్టి సవరించిన రూ. 8,118 కోట్ల బడ్జెట్​పై చర్చించి ఆమోదించటం కోసం ఈ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం కార్పొరేటర్ల నుంచి 125 ప్రశ్నలు రాగా, వాటిలో 21 ప్రశ్నలకు అధికారులు ఆమోదం తెలిపారు. పనుల పురోగతి, గతంలో విడుదలైన నిధుల వినియోగం, తమ ప్రాంతాల్లోని సమస్యల గురించి ఈ కౌన్సిల్ సమావేశంలో చర్చించాలని ఆయా పార్టీల కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు.

కౌన్సిల్ బలాలు..
2021 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లలో 56 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందగా, 48 స్థానాల్లో బీజేపీ, 44 స్థానాల్లో ఎంఐఎం గెలుపొందాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 2 సీట్లకే పరిమితమైంది. అయితే, తర్వాతి కాలంలో ఇద్దరు కార్పొరేటర్లు మరణించటం, రామ్నాస్ పురా కార్పొరేటర్‌గా ఉన్న మహ్మద్‌ ముబీన్‌ బహదూర్‌పురా ఎమ్మెల్యేగా, మెహిదీపట్నం కార్పొరేటర్‌ మహ్మద్‌ మాజీద్‌హుస్సేన్‌ (ఎంఐఎం) నాంపల్లి శాసనసభ్యుడిగా ఎన్నిక కావటంతో జీహెచ్ఎంసీలో ఈ నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 146కే పరిమితమైంది. కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు.. ఇలా మొత్తం 44 మంది ఎక్స్ అఫిషియో మెంబర్లుగా ఉన్నారు. అయితే, 2023 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. బీఆర్ఎస్, బీజేపీ నుంచి పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ప్రస్తుతం కౌన్సిల్‌లో కాంగ్రెస్​ కు 24, బీజేపీకి 39, ఎంఐఎం నుంచి 41, బీఆర్ఎస్ కు 42 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇక.. బీజేపీ, ఎంఐఎం,కాంగ్రెస్ ఎక్స్అఫిషియో మెంబర్లంతా ఆయా పార్టీలకే మద్దతుగా ఉండగా, బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

మేయర్‌ను టార్గెట్ చేసిన బీఆర్ఎస్ ​
తమ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మేయర్‌ గద్వాల విజయలక్ష్మిని గద్దె దించాలనే వ్యూహంతో బీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. అవిశ్వాసం ప్రవేశపెట్టటం ద్వారా తమ పార్టీ తరపున గెలిచి, కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో మెంబర్లుగా ఉన్న నగర ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపటం ద్వారా వారి మీద ఒత్తిడి పెంచి, ప్రజల దృష్టిని ఆకర్షించాలనే ప్రయత్నంలో కారు పార్టీ ఉంది. అలాగే, తమ హయాంలో ప్రారంభించి, నేటికీ అసంపూర్తిగా ఉన్న పనుల మీద మేయర్‌ను నిలదీసి నగరం మీద తమకు ఇంకా పట్టు ఉందనే భావనను కలిగించాలని బీఆర్ఎస్ తాపత్రయపడుతోంది.

కమలనాథుల వ్యూహం ఇదే..
ఇక.. బీజేపీ సైతం నగరంలోని పలు ప్రాంతాల్లోని పెండింగ్ పనుల పురోగతి మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని భావిస్తోంది. అదే సమయంలో.. ఎంఐఎం పార్టీని గట్టిగా ఇరుకున పెట్టి, ఆ పార్టీ కాంగ్రెస్‌ వైపు ఉన్నదా లేదా ఇంకా బీఆర్ఎస్ పక్షానే ఉన్నదా అనే అంశాన్ని బయటపెట్టటానికి ప్రయత్నిస్తోంది. ఒకవేళ.. ఈ సమావేశాల్లో ఎంఐఎం పార్టీ మీద ఒత్తిడి పెంచి ఆ పార్టీ కాంగ్రెస్‌కు దగ్గరయ్యేలా చేయగలిగితే, వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి ఎంఐఎం అవకాశవాదాన్ని బయటపెట్టొచ్చని, తద్వారా పాతబస్తీలో, మిగిలిన ప్రాంతాల్లో హిందూ ఓటుSet featured image బ్యాంకును పెంచుకోవచ్చని బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. అలాగే, పార్టీ మారిన వారిపై వేటు వేయాలనే డిమాండ్ ద్వారా ఉప ఎన్నికలు వస్తే తమకే లాభమని లెక్కలు వేసుకుంటోంది.

జంక్షన్‌లో.. ఎంఐఎం
అటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం, ఇటు ప్రధాన విపక్షంగా బీజేపీ బలపడటం, బీఆర్ఎస్ ప్రజాదరణను కోల్పోయి నానాటికీ బలహీనపడటంతో ప్రస్తుత పరిస్థితిలో కారు, హస్తం పార్టీల్లో దేనిని తమ మిత్రపక్షంగా భావించాలనే అంశంపై ఎంఐఎం మథనపడుతోంది. ఒకవేళ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌తో చేతులు కలిపితే, బీజేపీతో బాటు బీఆర్ఎస్ నుంచీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య కేంద్ర స్థాయిలో అంతర్గత అవగాహన ఉందనే అనుమానాల నేపథ్యంలో తమ పార్టీకి ప్రధాన బలంగా నిలుస్తోన్న.. హైదరాబాద్‌లోనే అడ్డుకట్ట పడే ప్రమాదం ఉందని ఎంఐఎం భావిస్తోంది. అలాగాక.. బీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుందనే భయాలూ ఆ పార్టీకి ఉన్నాయి.

దాటవేట ధోరణిలో కాంగ్రెస్..
కాగా, జీహెచ్ఎంసీలో తమకు పరిమితమైన బలం ఉందనే సంగతి తెలిసినప్పటికీ, కాంగ్రెస్ ఈ సమావేశంలో పైచేయి సాధించాలనే వ్యూహంతో ముందుకుపోతోంది. ముఖ్యంగా మేయర్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ చేసే ఆరోపణలను కొట్టి పారేసి, తమ హయాంలో చేసిన అభివృద్ధి పనులను జనానికి చెప్పుకునే ప్రయత్నంలో ఉంది. పనిలో పనిగా ఎంఐఎం నుంచి ఇప్పటికే అంతర్గంతంగా సహకారం పొందాలనే అవగాహనకు వచ్చిందనే వార్తలూ వినిపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ దూకుడుగా విపక్షాన్ని ఢీకొట్టాలని భావిస్తోంది. కాగా, బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన విజయలక్ష్మి మీద కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్లు మండిపడుతున్నారు. ఇటీవల ఆమె నిర్వహించిన సమావేశానికి కేవలం నలుగురే హాజరు కావటంతో కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచనలో పడింది.

అవిశ్వాసానికి రంగం సిద్దం
కాగా, వచ్చే ఫిబ్రవరి 20 నాటికి మేయర్, డిప్యూటీ మేయర్ లు ఎన్నిక జరిగి నాలుగేళ్లు అవుతుంది. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం నాలుగేళ్లు పూర్తయిన తర్వాతనే మేయర్ మీద అవిశ్వాసం పెట్టానే నిబంధన మేరకు వచ్చే ఫిబ్రవరి 20న మేయర్ మీద అవిశ్వాసం పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో మెంబర్లతో కలిపి మొత్తం 196 మందికి గానూ, అవిశ్వాసం నెగ్గాలంటే 2/3 మెంబర్స్ అంటే 131 మంది సభ్యుల బలం కావాలి. ఇప్పటి పరిస్థితిలో 42 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్ అఫీషియోలు కలిపి 71 మంది బలం ఉంది. ఇక.. బీజేపీకి 39 మంది కార్పొరేటర్లు, 6 ఎక్స్ అఫిషియో మెంబర్లు కలిపి 45 మంది బలం ఉంది. తాను అవిశ్వాసం పెడితే.. బీజేపీ మద్దతిస్తుందని బీఆర్ఎస్ గట్టిగా నమ్ముతోంది. ఒకవేళ.. ఇదే నిజమైనా, వీరిద్దరి బలం 116 మాత్రమే. అంటే ఇంకా 15 మంది సభ్యుల మంది బలం తక్కువగా ఉంది. అయితే, ఈ నేపథ్యంలో 41 కార్పొరేటర్లు, 10 మంది ఎక్స్ అఫిషియో సభ్యులున్న ఎంఐఎం మద్దతుతో ప్రస్తుతానికి గండం గట్టెక్కొచ్చని కాంగ్రెస్ భావిస్తోంది.