AP Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం.. ఇక ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు లేనట్టే!
AP Inter 1st Year Exams Cancelled: ఏపీ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు తొలగించనుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. సెకండియర్ పరీక్షలను మాత్రమే నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఈ మేరకు సీబీఎస్ఈ తరహాలోనే ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టనుంది.
కాగా, ఈ నిర్ణయం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. ఇంటర్ సిలబస్‌లో మార్పులు చేస్తున్నామని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఇంటర్నల్ విధానంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు జరగనున్నట్లు వెల్లడించారు. ప్రతి సబ్జెక్ట్‌కి 20 ఇంటర్నల్ మార్కులు ఉండనున్నట్లు తెలిపింది.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఇంటర్‌లో సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఈ విద్యలో ఎలాంటి సంస్కరణలు జరగలేదని, ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఇంటర్ మొదటి ఏడాది ఎగ్జామ్స్‌లను రద్దు చేసేందుకు భావించామని వివరించారు. దీంతో విద్యార్థులు నేరుగా సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మాత్రమే ఇంటర్ బోర్డు నిర్వహించనుందన్నారు.
సీబీఎస్ఈ సెలబస్ ఆధారంగా ఏపీ ఇంటర్ విద్యలో సంస్కరణలు చేపట్టినట్లు వివరించారు. అయితే ప్రముఖ విద్యావేత్తలతో పాటు ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సలహాలు తీసుకుంటామని కృతికా శుక్లా చెప్పారు. ప్రధానంగా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.