Last Updated:

Hijab : ’హిజాబ్‘ పై ఇరాన్ దారెటు ?

ఇరాన్‌లో కొనసాగుతున్న హిజాబ్‌ ఉద్యమంపై పలు రకాల విభిన్న వార్తలు వస్తున్నాయి.

Hijab : ’హిజాబ్‘ పై ఇరాన్ దారెటు ?

Hijab: ఇరాన్‌లో కొనసాగుతున్న హిజాబ్‌ ఉద్యమంపై పలు రకాల విభిన్న వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం మోరల్‌ పోలీసు వ్యవస్థను రద్దు చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. తర్వాత ప్రభుత్వం మాత్రం అలాంటిది ఏమీ లేదని హిజాబ్‌ వ్యవస్థ కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీంతో లేనిపోని గందరగోళం ఏర్పడింది. తాజా పరిణామాల మధ్య ఇరానీయన్లు మరో మూడు రోజుల పాటు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని పిలువునిచ్చారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో 22 ఏళ్ల మహషా అమిని హిజాబ్‌ సరిగా ధరించలేదని మోరల్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని.. చిత్ర హింసలకు గురి చేయడం వల్ల ఆమె చనిపోయారని వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ఇరాన్‌ అగ్ని గుండంగా మారిపోయింది.

మహషా అమిని మృతి తర్వాత ఇరాన్‌లో ప్రజా జీవనం స్తంభించిపోయింది. స్కూలు వెళ్లే విద్యార్థిని నుంచి కాలేజీ, యూనివర్శిటీల్లో చదివే విద్యార్థుల వరకు ఇళ్లలోనే పరిమితం అయ్యే మహిళ ల వరకు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. హిజాబ్‌ ఉద్యమం రోజు రోజుకు తీవ్రమవుతూ వస్తోంది. చివరకు ఇరాన్‌ చీఫ్‌ ఆయుతుల్లా ఖొమెనీ పదవి నుంచి దిగిపోవాలనే స్థాయికి వచ్చింది. 1979లో ఇరాన్‌ రాజు షాను దించడానికి ఇస్లామికి రెవెల్యూషన్‌ను ఉద్యమాన్ని తలపిస్తోంది ప్రస్తుతం హిజాబ్‌ ఉద్యమం. కాగా ప్రభుత్వం ఒక్క అడుగు వెనక్కితగ్గి మోరల్‌ పోలీసు వ్యవస్థను రద్దు చేస్తామని ప్రకటించినా.. ఉద్యమం మాత్రం తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.

ఇరానీయన్‌ ప్రాసిక్యూటర్‌ జనరల్‌ మహ్మద్‌ జాఫర్‌ మోన్‌టాజెరీ హిజాబ్‌ ఉద్యమం గురించి కీలక నిర్ణయం తీసుకున్నారు. మోరల్‌ పోలీసు యూనిట్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నామని ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే నిరసనల కారులు మొదటి రౌండ్‌ విజయం సాధించినట్లు లెక్కే. అయితే ఇరానీయన్‌ ప్రాసిక్యూటర్‌ మోరల్‌ పోలీసు యూనిట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినా… ఇరాన్‌ ఇంటిరియర్‌ మినిస్ర్టీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాగా మోరల్‌ పోలీసు ఇన్‌చార్జి ఇంటిరీయర్‌ మినిస్ర్టీ చేతిలోనే పనిచేస్తుంది. కాగా ఇరానీయన్‌ ప్రభుత్వ మీడియా కూడా మహ్మద్‌ జాఫర్‌ మోంట్రాజీ హిజాబ్‌ వ్యవస్థకు ఇన్‌చార్జీ కాదని.. హిజాబ్‌ వ్యవస్థను రద్దు చేయడానికి ఆయనకు ఎలాంటి అధికారం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇరాన్‌లో పరిస్థితులు మొత్తం గందరగోళానికి దారితీశాయి. మోరల్‌ పోలీసు వ్యవస్థ కొనసాగుతుందా.. లేదా రద్దు అయ్యిందా అనే దానిపై స్పష్టత లేదు. కాగా ఇరాన్‌లో మోరల్‌ పోలీసు పాత్ర విషయానికి వస్తే.. నిబంధనలను కఠినంగా అమలు చేస్తారు. ప్రజలు ఎలా వ్యవహరించాలి.. ప్రధానంగా మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలి. బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలి అనేది ఈ మోలర్‌ పోలీసులు క్షుణ్ణంగా గమనిస్తుంటారు. అయితే ఇరాన్‌ ఎంపీలు మాత్రం ప్రజల నిజమైన డిమాండ్‌లను ప్రభుత్వం పరిశీలిస్తుందని ప్రభుత్వ మీడియా చెబుతోంది.

అయితే ప్రభుత్వ అధికారులు, పార్లమెంటు సభ్యులు మాత్రం.. ప్రజల డిమాండ్‌లను ఖచ్చితంగా పరిశీలించాలని ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. ప్రధానంగా ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దితే.. నిరసన కారులను దారిలోకి తేవచ్చునని చెబుతున్నారు. ఇరాన్‌ పార్లమెంటు ఎంపీ నిజాముద్దీన మౌసవీ ఈ విషయాన్ని చెప్పినట్లు ఇరాన్‌ మీడియా ప్రముఖంగా పేర్కొంది. అయితే మోరల్‌ పోలీసు వ్యవస్థను రద్దు చేయాలనే అంశం గురించి ఆయన ఎక్కడా స్పందించలేదని చెబుతున్నారు. అసోసియెటేడ్‌ ప్రెస్‌ అంచనా ప్రకారం ఇరాన్‌లో మహషా అమిని హిజాబ్‌ వ్యతిరేక ఉద్యమం మొదలైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున తమ హిజాబ్‌ను మంటల్లో వేయడం, ముస్లిం మత పెద్దల తలపాగాను తొలగించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి మోరల్‌ పోలీసు అధికారులు దేశంలోని పెద్ద పెద్ద నగరాల నుంచి మటుమాయం అయ్యారు. హిజాబ్‌ వ్యతిరేక ఉద్యమం మొదలైనప్పటి నుంచి దేశంలో మహిళలు బహిరంగంగా హిజాబ్‌ ధరించడం మానేశారు. ఇరానీయన్‌ చట్టాలను అస్సలు పట్టించుకోవడం లేదు. అయితే హిజాబ్‌ను రద్దు చేసినట్లు ప్రకటించిన అధికారి మాత్రం దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. కాగా హిజాబ్‌ వ్యవస్థను రద్దు చేసినా న్యాయవ్యవస్థ మాత్రం హిజాబ్‌ వ్యవస్థపై ఓ కన్నేసి ఉంటుందని చెబుతున్నారు.

హిజాబ్‌ వ్యతిరేక ఆందోళన మొదలైనప్పటి నుంచి పోలీసులు 18వేల మందిని అరెస్టు చేశారు. కొన్ని చోట్ల ఉద్యమం హింసాత్మకంగా మారిందని ఇరాన్‌ మానవ హక్కుల సంఘం పేర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో నిరసన కారులు ఇరాన్‌ రాజధాని టెహరాన్‌లోని ఆజాద్‌ స్క్వేర్‌లో మూడు రోజుల పాటు ఉద్యమానికి పిలువునిచ్చారు. గతంలో కూడా ఇలాంటి పిలువులు వచ్చినప్పుడు ఇరాన్‌లో పలు చోట్ల హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తాజా పరిణామాలపై విదేశీ అబ్జర్వర్స్‌ మాత్రం దీనికంతటికి కారణం ఇరాన్‌ పాలకుల స్వయంకృపరాథమేనని చెబుతున్నారు. నిరసన కారులపై అత్యంత దారుణంగా వ్యవహరించడంతో పరిస్థితులు అదుపు తప్పాయని వారు విశ్లేషిస్తున్నారు.

1979లో ఇరాన్‌ షాను గద్దె దించిన తర్వాత మత గురువు ఆయతుల్లా ఖొమెనీ ఇరాన్‌ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఖఠినమైన ఇస్లామిక్‌ నిబంధనలతో పాలన కొనసాగిస్తున్నారు. మహిళలు తప్పకుండా హిజాబ్‌ ధరించాల్సి వస్తోంది. కాగా సంస్కరణవాదులు మాత్రం హిజాబ్‌ ధరించాలా వద్దా అనేది వ్యక్తిగత ఇష్టానికి వదిలేయాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: