Donald Trump: కెనడా, మెక్సికోలకు భారీ షాక్ ఇచ్చిన ట్రంప్.. మార్చి 4 నుంచి 25శాతం టాక్స్

Donald Trump says 25 percent tariffs on Canada, Mexico: అనుకున్నదంతా అయింది. తాను గద్దెనెక్కితే ప్రత్యర్థి దేశాలనుంచి భారీ సుంకాలను పిండుకుంటానని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మెక్సికో, కెనడాలకు భారీ షాకిచ్చారు. వచ్చే మార్చి 4న నుంచి ఆ రెండు దేశాలు 25 శాతం సుంకం కడితేనే, తమ దేశంలోకి అనుమతిస్తానని ఆయన స్పష్టం చేశారు. తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు వసూలు చేసే దేశాలన్నింటి విషయంలోనూ ఇదే వైఖరిని అవలంబించబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ఇక.. లెక్క లెక్కే..
పలు దేశాలు అమెరికా వస్తు సేవల మీద భారీ సుంకాలు విధించి, తమ దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని ఆది నుంచి ట్రంప్ చెబుతూనే వచ్చారు. ఈ విధానంలో ఆయా దేశాలు బాగుపడటం తప్ప తమకు దక్కిందేమీ లేదనేది ఆయన వాదన. కనుక, సదరు దేశం తమ ఉత్పత్తి మీద ఎంత సుంకం విధిస్తే, ఇకపై తామూ అంతే సుంకం విధించాలని ట్రంప్ యోచిస్తున్నారు. ఇందులో భారత్‌కు కూడా ఎలాంటి మినహాయింపు లేదని గతంలోనే ట్రంప్ ప్రకటించారు.
అమెరికాలో ఆందోళన..
ఒకవేళ ట్రంప్ నిర్ణయం అమల్లోకి వస్తే.. అనేక దేశాలు తమ దేశపు వస్తు సేవల మీద భారీగా సుంకాలు విధించటం ఖాయమని, అప్పుడు ప్రపంచ దేశాలు.. తక్కువ సుంకాలు వసూలు చేసే దేశాల వస్తు సేవలకు మరలి పోతారని, ఇదే జరిగితే అమెరికాకు ఆర్థికంగా భారీ నష్టమని అక్కడి ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి, ధరలు భారీగా పెరిగే ప్రమాదమూ ఉందనేది వారి ఆలోచనగా ఉంది.
కాదంటున్న ట్రంప్..
అయితే, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రతీకార సుంకాల వల్ల భారీగా అమెరికా ఖజానాకు నిధులు సమకూరతాయని, వాటిని దేశీయ మార్కెట్లోకి మళ్లిస్తే బోలెడన్ని ఉద్యోగాలు వస్తాయని, తమ ఆర్థిక వ్యవస్థ ఊహించనంతగా పెరుగుతుందని ట్రంప్ నచ్చజెబుతున్నారు.