Sodara Trailer: సంపూర్ణేష్ బాబు సోదరా ట్రైలర్ చూశారా.. హిట్ అయ్యేలానే ఉందే

Sodara Trailer: హృదయ కాలేయం సినిమాతో సంపూర్ణేష్ బాబు తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో సంపూకి బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది. ఇక వెళ్లిన వారం రోజులకే ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. గ్రామంలో అందరి మధ్యన పెరిగిన సంపూకి.. బిగ్ బాస్ వాతావరణం నచ్చక.. ఉండలేకపోయాడు. ఈ విషయాన్నే సంపూ చాలాసార్లు చెప్పుకొచ్చాడు. వారంలో బయటకు వచ్చినా కూడా సన్నపిన్ను ఛార్జర్ ఉందా అనే డైలాగ్ తో ఫేమస్ అయ్యాడు.
ఇక బిగ్ బాస్ నుంచి వచ్చాకా.. పలు సినిమాల్లో నటిస్తూ వచ్చిన సంపూర్ణేష్ బాబు.. తాజాగా సోదరా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంజనీష్ మరో హీరోగా నటిస్తున్నాడు. క్యాన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాను చంద్ర చగన్ల నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా సోదరా సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకోవడమే కాకుండా నవ్వులు పూయిస్తుంది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధాలు.. ప్రేమలు, ఆప్యాయతలు ట్రైలర్ లో చూపించారు. ” దునియాలో ఏడనైనా చంటి పోరలు నాయనా అని పిల్చడం విన్నావా.. మొదటి మాట అమ్మ అనే పిలుస్తాడు.. నాయనాతోనే షురూ చేస్తాడు” అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఇక ఆ చంటి పిల్లాడు.. అమ్మ, నాయనా అనకుండా అన్నా అని పిలవడంతో సంపూ ఎంట్రీ ఇవ్వడంతో అతనే అన్న అని చూపించారు.
ఇక అన్నదమ్ముల మధ్య ఉండే గొడవలు.. ప్రేమలు చూపిస్తూనే.. వీరిద్దరూ కలిసి ఒకే అమ్మాయికి సైట్ కొట్టడం కూడా చూపించారు. అన్న పెళ్లి చేయాలనీ తమ్ముడు పడే కష్టాలు.. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అన్న.. వరుసగా పెళ్లి చూపులకు వెళ్లడం, అవన్నీ రిజెక్ట్ అవ్వడం.. చివరికి అన్న పెళ్లే పెద్ద సమస్యగా మారడం చూపించారు. ఇక చివర్లో అన్న జోలికి ఎవరైనా వస్తే చంపి బొంద పెడతాను అని తమ్ముడు చెప్పిన డైలాగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.
ఇప్పటివరకు సంపూ చేసిన చిత్రాలు వేరు.. ఈ చిత్రం వేరు అన్నట్లు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఎలాంటి క్రింజ్ లేకుండా కుటుంబ కథా చిత్రంగా సోదరా తెరకెక్కింది.ఏప్రిల్ 25 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ ను బట్టి ఈ సినిమా హిట్ అయ్యేలానే ఉంది అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో సంపూ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.