Twitter : ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులకు బెడ్రూంలు
ట్విట్టర్లో సిబ్బందిని సగానికి సగం తగ్గించడంతో ఉద్యోగుల్లో పని భారం భారీగా పెరిగిపోయింది. దీంతో మస్క్ మదిలో కొత్త ఐడియా వచ్చింది.
Twitter: ట్విట్టర్లో సిబ్బందిని సగానికి సగం తగ్గించడంతో ఉద్యోగుల్లో పని భారం భారీగా పెరిగిపోయింది. దీంతో మస్క్ మదిలో కొత్త ఐడియా వచ్చింది. ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలో కాన్ఫరెన్స్ రూమ్‌లో కొంత భాగాన్ని బెడ్రూంగా మార్చాలనే నిర్ణయానికి వచ్చారు. కాన్పరెన్స్ రూంలోని కొంత భాగంలో తాత్కాలిక బెడ్లను ఏర్పాటు చేయడంతో పాటు దానికి తగ్గట్టు ఫర్నిచర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఉదాహరణకు బెడ్ పక్కన టేబుల్ ఆర్మ్‌చెయిర్ లాంటి సదుపాయాలు ఉద్యోగుల కోసం అందుబాటులోకి తెచ్చారు.
ఆఫీస్‌లో బెడ్రూంలు ఏర్పాటుపై శాన్ఫ్రాన్సిస్కో మేయర్ లండన్ బ్రీడ్ తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై విచారణ చేపడతామని చెప్పారు. కాన్ఫరెన్స్ రూంలను బెడ్రూంలుగా ఎలా మారుస్తారని మస్క్‌ను నిలదీశారు. అలసిపోయిన ఉద్యోగులను ఇంటికి పంపించకుండా… పడకలు ఏర్పాటు చేయడం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శాన్ఫ్రాన్సిస్కో మేయర్‌పై మండిపడ్డారు మస్క్. బిల్డింగ్‌లను తనిఖి చేయడం తర్వాత చూద్దాం … ముందు పసిపిల్లల ఆరోగ్యం గురించి చూడండంటూ చురకలంటించారు. శాన్ఫ్రాన్సిస్కో ప్లే గ్రౌండ్లో ఓ పది నెలల బాలుడికి ఫెంటానిల్ ఇంజెక్షన్ ఇచ్చారు. అది వికటించి ఆ బాలుడు ప్రాణాపాయస్థితికి చేరుకున్నాడు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా అని మేయర్‌పై విరుచుకుపడ్డారు. దీనిపై మేయర్ కూడా వివరణ ఇచ్చారు. ఏ మందుల కంపెనీ మందులను సరఫరా చేసిందో వారే బాధ్యత వహించాల్సి వస్తుందని పేర్కొన్నారు.
అయితే తాజాగా మస్క్ తీసుకున్న నిర్ణయంపై షోషల్ మీడియా యూజర్లు రెండుగా చీలిపోయారు. కొంత మంది మస్క్ నిర్ణయాన్ని సమర్థిస్తే.. మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఉద్యోగి అలిసిపోతే వారిని ఇళ్లకు పంపించి విశ్రాంతి తీసుకొనివ్వాలని అంటే.. మరి కొందరు మాత్రం మస్క్ అలిసిపోయిన ఉద్యోగులకు బెడ్లను ఏర్పాటు చేసి విశ్రాంతి తీసుకోవడానికి అనుమతించడం ఆయన బాధ్యత అని మస్క్‌ను వెనకేసుకువచ్చారు. గూగుల్‌లో కూడా ఇలాంటి సదుపాయాలున్నాయని ఒక యూజర్ ప్రస్తావించారు. గూగుల్‌లో అలిసిపోతే కునుకుతీయడానికి కార్యాలయంలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. గూగుల్ చేస్తే లేని తప్పు.. మస్క్ చేస్తే తప్పా అని నిలదీస్తున్నారు.