China : ఈయూతో కలిసి పనిచేసేందుకు సిద్ధం : చైనా

China: ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే విషయంలో అగ్రరాజ్యం అమెరికా, ఐరోపా సమాఖ్య మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఇదే అదునుగా భావించిన చైనా ఈయూతో తన సంబంధాలను మరింత పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అమెరికా తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈయూతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా పార్లమెంట్ ప్రతినిధి లౌ కిన్జియాన్ మంగళవారం పేర్కొన్నారు.
50 ఏళ్లు ఎలాంటి ఘర్షణలు లేవు..
50 ఏళ్లుగా చైనా యూరప్ దేశాల మధ్య ఎటువంటి ఘర్షణలు లేవని చెప్పవచ్చు. ఇరుదేశాలు అనేక అంశాల్లో భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. చైనా ఉత్పత్తులకు, ఇక్కడ రూపొందించే ఏఐ అనుకూల ఇ-వాహనాల బ్యాటరీలకు ఈయూ దేశాలు లాభదాయకమైన మార్కెట్‌గా ఉన్నాయి. అందుకు ఆ రెండు దేశాలతో సంబంధాలు మరింత పెంచుకోవడానికి ఆసక్తితో ఉన్నామని లౌ కిన్జియాన్ పేర్కొన్నారు. చైనా యూరప్ దేశాల మధ్య సంబంధాలు ఏ మూడో పక్షాన్ని లక్ష్యంగా చేసుకోమని, వాటిపై ఆధారపడి ఉండవని పరోక్షంగా అగ్రరాజ్యం అమెరికా ఐరోపా దేశాల మధ్య సంబంధాలను ఉద్దేశించి మాట్లాడారు.
ట్రంప్, జెలెన్స్కీకి మీడియా ఎదుట వాగ్వాదం..
ఇటీవల అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి మీడియా ఎదుట తీవ్ర వాగ్వాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలను చైనా సర్కారు ఆధ్వర్యంలోని మీడియా సంస్థలు ప్రసారం కూడా చేశాయి. ఉక్రెయిన్ యుద్ధం ముగింపు విషయంలో ట్రంప్, పుతిన్ మధ్య సయోధ్య పెరుగుతుండటం పట్ల బీజింగ్ ఆందోళన చెందుతున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. వాషింగ్టన్‌తో మాస్కో జరుపుతున్న చర్చల గురించి జిన్‌పింగ్‌కు వివరించడానికి పుతిన్ తన ఉన్నత భద్రతా అధికారి సెర్గీ షోయిగును బీజింగ్‌కు పంపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చైనా ఈయూ దేశాలతో సంబంధాలపై ప్రకటన చేయడం గమనార్హం.