CM Revanth Reddy: రాష్ట్రసాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకం.. ఆరు గ్యారంటీలకు ఆర్టీసీ ఉద్యోగులే ప్రచారకర్తలు
CM Revanth Reddy at Yuva Vikasam Meeting: తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని, కార్మికులు జంగ్ సైరన్ మోగించి, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తయిన సందర్బంగా నగరంలోని ఎన్టీఆర్ మార్గ్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్‌లో గురువారం నిర్వహించిన సభలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ రవాణాశాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం సందర్శించారు.
లాభాల్లోకి ఆర్టీసీ
కార్మికుల ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చకుండా గత బీఆర్ ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని సీఎం మండిపడ్డారు. హక్కుల కోసం పోరాడి ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను కనీసం పరామర్శించేందుకు బీఆర్ఎస్ నేతలు వెళ్లలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీలను ప్రజల్లోకి బస్సుల ద్వారా తీసుకువెళ్లిన ఆర్టీసీ అన్నలకు కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉంటుందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించామని పేర్కొన్నారు. గత పాలకులు ఆర్టీసీని నష్టాల్లోకి నెడితే, తాము రూ.4 వేల కోట్లు ఆర్టీసీకి మహాలక్ష్మి పథకం సబ్సిడీని మంజూరు చేసి, సంస్థను లాభాల పట్టించామన్నారు.
ఇన్ని కొలువులు మా ఘనతే
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కొలువుల కోసం కొట్లాడిన తెలంగాణ యువత ఆకాంక్షను గుర్తించి తమ సర్కారు తొలి ఏడాదిలోనే 55వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు. ఇందులో ఒక్క తల తగ్గినా తాను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇంకా అనుమానాలుంటే కేసీఆర్, మోదీ వచ్చి లెక్కపెట్టుకోవచ్చని సెటైర్ వేశారు. తన మాటని తప్పని తేలితే సారీ చెబుతానన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్లు పారిపోతే.. కోర్టుల్లో కేసులు పరిష్కరించి మొదటి ఏడాదిలోనే 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు.
పేదలకు అండగా..
పేదవాళ్లకు 200 యూనిట్ల కరెంట్, రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ద్వారా వారికి అండగా నిలుస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్టే అని నాడు కేసీఆర్ రైతులను బెదిరిస్తే.. తాము రైతులకు బోనస్ ఇస్తున్నామని పేర్కొన్నారు. రైతులు సన్నవడ్లు ఎక్కువగా పండిస్తే.. రేషన్ ద్వారా పేద ప్రజలకు, అన్ని ప్రభుత్వ హాస్టళ్లలో సన్నబియ్యం ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
డీజిల్ బస్సులు ఉండవు..
ఆర్టీసీలోని డీజిల్ బస్సులను రానున్న రెండేళ్లలో సిటీ బయటికి తరలించి, 3000 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తామని సీఎం ప్రకటించారు. డీజిల్ ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ ఆటోలు కొన్నవారికి రాయితీలు ఇచ్చేందుకు ప్రణాళికలు చేస్తామన్నారు. గోదావరి నీటిని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో నింపి మూసీ నదిలో మంచి నీరు పారిస్తామని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా మార్చేందుకు రూ.7వేల కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని, దానికి ప్రజల సహకారం అవసరమని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
కొత్త స్క్రాప్ పాలసీ
ఢిల్లీ నగరంలో కాలుష్యం వలన అక్కడ అప్రకటిత లాక్ డౌన్ విధించారని, కొన్నేళ్ల తర్వాత ఢిల్లీ జనావాసంగా పనికిరాదని సీఎం తెలిపారు. హైదరాబాద్ నగరానికి అలాంటి పరిస్థితి రాకుండా చేసేందుకు స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామన్నారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను స్క్రాప్ కు పంపి కాలుష్యం తగ్గేలా చేస్తామన్నారు. ఈ- వాహనాలు కొన్నవారికి రిజిస్ట్రేషన్ ఉచితంగా చేస్తున్నామని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వే యాప్‌ను ప్రారంభించిన సీఎం
గుడి లేని ఊరు ఉందేమో కానీ.. ఇందిరమ్మ ఇళ్లు లేని పల్లె లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే యాప్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మ గౌరవంతో బతకాలనేది ప్రతి ఒక్కరి కల అన్నారు. పేదల కలను ఆనాడే ఇందిరా గాంధీ గుర్తించిందని తెలిపారు. వ్యవసాయ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తో పేదలకు పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఒక్క తెలంగాణలోనే 35 లక్షల భూ పంపకాలు చేపట్టారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. రాష్ట్రంలో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని పేర్కొన్నారు. కేసీఆర్ రద్దు చేసిన హౌసింగ్ డిపార్ట్‌మెంట్ ను కూడా పునరుద్ధరించామని తెలిపారు.