BJP NVSS Prabhakar: కేసీఆర్, రేవంత్ తోడు దొంగలు.. మాజీ సీఎం కేసీఆర్ బాటలోనే నేటి సీఎం
BJP NVSS Prabhakar Key Comments: రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు ఒక్కటేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ప్రజలకు మోసం చేయడంలో రేవంత్ కూడా చంద్రశేఖర్ బాటలోనే నడుస్తున్నాడని ఆరోపించారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆరు అబద్ధాలు.. 66 మోసాలపై బీజేపీ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చార్జిషీట్ పెట్టారన్నారు. దానిపై ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం లేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు కూడా చార్జిషీట్ పెడతామని మాట్లాడుతున్నారని, కానీ, వారికి ప్రతిపక్ష పాత్ర పోషించే తీరిక కూడా లేదని మండిపడ్డారు. ఆ పార్టీకి కాలం చెల్లిందని జోస్యంచెప్పారు. అందుకే, కేసీఆర్ ఫాంహౌజ్‌లో కాలం వెల్లదీస్తున్నాడన్నారు. తండ్రి కేసీఆర్ రాజీకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవటంతో ఆయన కొడుకు మతిమాలిన మాటలు మాట్లాడుతుండగా, కూతురు నీతి సూత్రాలు వల్లె వేస్తోందని విమర్శించారు.
బీఆర్ఎస్ కు చార్జిషీట్ పెట్టే అర్హత లేదు..
కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, లిక్కర్ స్కామ్ అంశాల్లో చార్జీషీట్ కు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశాడన్నారు. వర్గీకరణ విషయంలో దేశంలోనే తొలి ముఖ్యమంత్రిని అని చెప్పుకొని రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. సబ్ ప్లాన్ విషయంలో కేసీఆర్ పదేళ్లు పబ్బం గడుపుకొని, సబ్ ప్లాన్ కు తూట్లు పొడిచారన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఏడాది కాలంలో సబ్ ప్లాన్ ముచ్చటే లేకుండా కాలం గడిపాడని ఆరోపించారు. ఏ విషయంలో చూసినా కేసీఆర్ పదేళ్లు, రేవంత్ రెడ్డి సంవత్సరం కలిసే నడుస్తున్నాయని, కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి అని విమర్శలు చేశారు. ఈ విషయాలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీకి చార్జిషీట్ పెట్టే అర్హత లేదని, ముందు వారిపై ఉన్న చార్జిషీట్లకు సమాధానం చెప్పాలన్నారు.