Maharashtra, Jharkhand Election 2024: రేపే పోలింగ్.. ముగిసిన రెండు రాష్ట్రాల ప్రచారం.. ఫలితాలపై ఉత్కంఠ
Election Campaign Ended In Jharkhand And Maharashtra: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. సోమవారం సాయంత్రానికి రెండు రాష్ట్రాల్లో క్యాంపెయినింగ్ పూర్తయింది. 48 గంటల సైలెంట్ పీరియడ్ తర్వాత 20వ తేదీన ఇక్కడ పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో రేపు (నవంబరు 20) పోలింగ్ జరగనుంది. ఇక, జార్ఖండ్‌లో తొలివిడతలో 43 సీట్లకు నవంబరు 13న పోలింగ్ జరగగా, రెండవ విడతలో భాగంగా 38 స్థానాలకు రేపు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెలువడనున్నాయి.
జోరుగా మహాపోరు
మహారాష్ట్రలో అధికారపక్షం(మహాయుతి-బీజేపీ, శివసేన(షిండే వర్గం), ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం) విజయమే లక్ష్యంగా శాయశక్తులా ప్రచారం చేశాయి. తమ రెండున్నరేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా నెలవారీగా మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తున్న లడ్కీ బహిన్ పథకాన్ని అధికార కూటమి జనంలోకి తీసుకుపోయింది. ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రతిపక్ష అజెండాను చావుదెబ్బతీసేలా ‘బాటేంగే తో కటేంగే, ‘ఏక్‌హై తో సేఫ్ హై’ వంటి నినాదాలను తెరమీదికి తెచ్చింది. అటు, ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా, యూపీ సీఎం యోగి రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు. ఇక ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(కాంగ్రెస్, శివసేన(ఉద్ధవ్ ఠాక్రే), ఎన్సీపీ(శరద్ పవార్ వర్గం))లు సామాజిక న్యాయం, కుల గణన, రాజ్యాంగ పరిరక్షణ వంటి అంశాలు విస్తృతంగా ప్రచారం చేసింది. బీజేపీ నినాదాలకూ గట్టి కౌంటరే ఇచ్చింది. మహాయుతికి ప్రజా సంక్షేమం కంటే కార్పొరేట్ దిగ్గజాల మీదనే బీజేపీ చూపు అనే ప్రచారాన్ని బాగా జనంలోకి తీసుకుపోయింది.
జేఎంఎంపైనే భారం?
ఇక, జార్ఖండ్ రాష్ట్రంలో ప్రచార బాధ్యతలను జేఎంఎం భుజాన వేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్ కేవలం తన పార్టీ అభ్యర్థుల క్యాంపెయినింగ్‌కే పరిమితమైంది. ఇండియా కూటమి తరపున ఉన్న ఇతర పార్టీల నేతలెవరూ ఇక్కడ కాంగ్రెస్ తరపున ప్రచారం చేసేందుకు ముందుకు రాకపోవటం, కాంగ్రెస్, జేఎంఎం పార్టీల నేతలు సైతం ఎవరికి వారే అన్నట్లుగా ప్రచారంలో పాల్గొనటంతో ఇక్కడ వీరి ప్రచారం చప్పగా సాగింది. సీఎం హేమంత్ సోరెన్ అన్నీ తానై వ్యవహరిస్తూ మొత్తానికి ప్రచారం ముగించారు. ఇక్కడ సహజ వనరుల దోపిడీ, బంగ్లాదేశ్ చొరబాటుదారులు, అవినీతి వంటి అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య ఘాటుగా ప్రచారం సాగింది. భారీగా నగదు సీజ్
నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి మొత్తం రూ.1082.2 కోట్ల ఎన్నికల తాయిలాలను సీజ్ చేయగా.. ఇందులో మహారాష్ట్రలో రూ.660.18కోట్లు.. ఝార్ఖండ్‌లో రూ.198.12కోట్లు, 14 రాష్ట్రాల్లోని ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో రూ.223.91 కోట్లు ఉన్నట్లు ఈసీ వివరించింది. సీజ్ చేసిన దాంట్లో రూ.181.97 కోట్లు నగదు కాగా.. రూ.119.83 కోట్ల విలువ చేసే మద్యం, రూ.123.57 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, రూ.302.08 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.354.76 కోట్ల విలువైన ఉచితాలు, ఇతర వస్తువులు ఉన్నట్లు పేర్కొంది.