Massive Encounter: ఎన్‌కౌంటర్‌లో 8 మంది నక్సల్స్ మృత్యువాత.. మృతుల్లో కీలక నేత!

Massive Encounter in Jharkhand: జార్ఖండ్‌లో మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాగా, బొకారో జిల్లా లాల్‌పానియా ప్రాంతంలో జరిగింది. అనంతరం ఘటనాస్థలంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో కీలక నేత అయిన మావోయిస్టు నేత వివేక్ కూడా ఉన్నారు. కాగా, ఆయనపై అంతకుముందు రూ.కోటి రివార్డు ప్రకటించారు.
బొకారో జిల్లాలోని లాల్ పానియా ప్రాంత సరిహద్దులో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో సీఆర్పీఎఫ్ బృందానికి చెందిన 209 కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ దళాలు, పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టారు. తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో లుకు కొండల ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ సమయంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8మంది మావోయిస్టులు చనిపోయినట్లు సీఆర్పీఎప్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇరు వర్గాలకు ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఇదిలా ఉండగా, అంతకుముందు జార్ఖండ్‌లోని సింఘ్ భమ్ జిల్లాలో భద్రతా దళాలు బాంబు స్కాడ్ గుర్తించారు. ఈ ప్రాంతంలో సీఆర్పీఎఫ్, పోలీసులు కూంబింగ్ బాక్రబేదా ప్రాంతంలో రెండు ఐఈడీలను గుర్తించారు. అనంతరం బాంబు స్కాడ్ సిబ్బంది నిర్వీర్యం చేశారు. అలాగే దాదాపు 11 మావోయిస్టు బంకర్లను ధ్వంసం చేశారు.