Trending News : గిరిజిన బాలికకు ఘోర అవమానం… ఆలస్యంగా వెలుగులోకి ఘటన !
Trending News : డబ్బు దొంగించిందనే అనుమానంతో గిరిజన బాలిక పట్ల హాస్టల్ మహిళా సూపరింటెండెంట్ దారుణంగా వ్యవహరించింది. విద్యార్థిని మెడలో బూట్ల దండ వేసి ఊరేగించిన అవమానీయ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
Trending News : డబ్బు దొంగించిందనే అనుమానంతో గిరిజన బాలిక పట్ల హాస్టల్ మహిళా సూపరింటెండెంట్ దారుణంగా వ్యవహరించింది. విద్యార్థిని మెడలో బూట్ల దండ వేసి ఊరేగించిన అవమానీయ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కాగా ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే… బేతుల్ జిల్లా దామ్‌జీపురా గ్రామం లోని ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్‌లో గత వారంలో ఈ దారుణ ఘటన జరిగినట్లు సమాచారం అందుతుంది.
గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ వసతి గృహంలో ఓ బాలిక 5 వ తరగతి చదువుతుంది. కాగా తోటి విద్యార్ధిని నుంచి రూ.400 దొంగిలించినట్లు అనుమానించి అందుకు శిక్షగా ఆమె ముఖానికి నల్ల సిరాతో మేకప్ వేసి దెయ్యంలా కనిపించేలా చేశారని… ఆ తర్వాత బూట్ల దండతో హాస్టల్ క్యాంపస్‌లో బలవంతంగా ఊరేగించినట్లు తెలిపింది. కాగా ఈ విషయాలను ఇటీవల ఆమెను చూడడానికి వచ్చిన తల్లితో చెప్పడంతో… వారి కుటుంబ సభ్యులు కలెక్టర్ ను ఆశ్రయించారు.
ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు ఈరోజు జిల్లా కలెక్టర్ అమన్‌వీర్ సింగ్ బైన్స్‌కు సమాచారం అందించడంతో విషయం బయటికి వచ్చింది. బాలిక తండ్రి రాతపూర్వక ఫిర్యాదును స్వీకరించిన తర్వాత కలెక్టర్ బెయిన్స్ మాట్లాడుతూ… విచారణకు ఆదేశించామని, దోషులుగా తేలిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, మహిళా సూపరింటెండెంట్‌ను ఆ పదవి నుంచి తొలగించినట్లు గిరిజన వ్యవహారాల శాఖ అసిస్టెంట్ కమిషనర్ శిల్పాజైన్ తెలిపారు.