IPL 2025: ఐపీఎల్ వేళ బీసీసీఐ కొత్త నిబంధనలు.. సలైవాపై నిషేధం ఎత్తివేత!

BCCI Changes Big Rule Lifts Ban On Saliva Rule For IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ తరుణంలో బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో భాగంగా బీసీసీఐ పది జట్ల కెప్టెన్లతో మీటింగ్ నిర్వహించింది. ఈ మేరకు లీగ్‌లో మార్పులు, చేర్పులపై సలహాలు, సూచనలు అందించింది.
ఐపీఎల్ లీగ్‌లో పది జట్ల కెప్టెన్ల విజ్ఞప్తి మేరకు సలైవా నిషేధాన్ని బీసీసీఐ ఎత్తేసింది. ఇక నుంచి బౌలర్లు బంతిని నునుపు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. సాధారణంగా సలైవా వాడటంతో బంతి తన మెరుపును కోల్పోకుండా ఉండి రివర్స్ స్వింగ్‌కు సహకరించే అవకాశం ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా బౌలర్లు లాలా జలాన్ని వాడుతున్నప్పటికీ, కరోనా నేపథ్యంలో సలైవాను వాడకుండా ఐసీసీ నిషేధించింది. ఇప్పడు కరోనా ప్రభావం లేకపోవడంతో ఈ నిషేధాన్ని ఎత్తేయాలని బౌలర్లు కోరారు. దీంతో బీసీసీఐ ఈ నిషేధాన్ని ఎత్తేసింది.
అంతకే కాకుండా బౌలర్లకు అనుకూలంగా బీసీసీఐ మరో నిర్ణయం కూడా తీసుకుంది. మ్యాచ్ ఫలితాలపై డ్యూ ప్రభావం చూపిస్తుండటంతో బీసీసీఐ కొత్త రూల్ ప్రవేశ పెట్టింది. వచ్చే సీజన్ నుంచి రెండో ఇన్నింగ్స్‌లో రెండు బంతులను ఉపయోగించనున్నారు. రెండో ఇన్నింగ్స్ 11వ ఓవర్ తర్వాత కొత్త బంతిని ప్రవేశ పెట్టనున్నారు. దీంతో మ్యాచ్ ఫలితాలపై టాస్ ప్రభావం కూడా తగ్గనుంది. గతంలో టాస్ గెలిచిన జట్లు ఎక్కువగా ఫీల్డింగ్ ఎంచుకుంటున్న విషయం తెలిసిందే.