Konaseema Thugs Movie Review : ప్రముఖ కొరియోగ్రాఫర్ గా బృంద తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. పలు భాషలలో పాటలకు తనదైన శైలిలో కొరియోగ్రఫీ చేసి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. కాగా జాతీయ అవార్డ్ తో పాటు తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు గెలుపొందిన బృందా దర్శకురాలిగా మారిన విషయం తెలిసిందే. ఆమె డైరెక్షన్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన తొలి చిత్రం ‘హే సినామిక’. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికి ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. కాగా ఇప్పుడు బృందా ద్వితీయ యత్నంగా హ్రిదూ హరూన్ తో తెలుగు, తమిళ భాషల్లో తీసిన సినిమా ‘కోనసీమ థగ్స్’. హ్రిదు హరూన్‌ని జోడీగా అనస్వర రాజన్ నటించగా.. బాబీ సింహ, ఆర్.కె.సురేష్, మునీష్ కాంత్, అనస్వర రంజన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ షిబు తమీన్స్ కుమార్తె రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై జియో స్టూడియోస్ భాగస్వామ్యంతో భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందు వచ్చింది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో మీకోసం ప్రత్యేకంగా..
శేషు(హృదు హరూన్) ఒక అనాధ. కాకినాడ రౌడీ పెద్దిరెడ్డి దగ్గర పని చేస్తుంటాడు. అక్కడే ఓ అనాధాశ్రయంలో ఉంటున్న మూగ అమ్మాయి కోయిల(అనస్వర రాజన్)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదామనుకున్న సమయంలో ఓ హత్య కేసులో అరెస్ట్ అవుతాడు. కాకినాడ జైలులో దొర(బాబీ సింహ), మధు(మునీష్ కాంత్)తో పాటు రకరకాల మనుషులు పరిచయం అవుతారు. వీరందరితో కలిసి జైలు నుంచి పారిపోవడానికి శేషు ఒక ప్లాన్ వేస్తాడు. మరి శేషు ప్లాన్ వర్కవుట్ అవుతుందా? దొర ప్లాష్ బ్యాక్ ఏంటి? హత్య చేసిన శేషుని వెంటాడుతున్నది ఎవరు? అసలు శేషు ఒకరిని ఎందుకు హత్య చేశారు? జైలు సిబ్బంది శేషుని ఎందుకు చంపాలనుకుంటుంది? కోయిల, శేషు కలిశారా లేదా? వీరికి చిట్టి ఎలాంటి సహాయం చేశాడు? జైలు సిబ్బంది ఎందుకు శేషుని చంపాలనుకుంటారు? చివరికి వారు తప్పించుకోగలిగారా? అన్నదే ఈ చిత్ర కథాంశం.
ఒక్క పాయింట్ చుట్టే కథ అంతా తిరుగుతూ.. ఆద్యంతం ఆసక్తికరంగా, ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే సినిమాలు చాలా ఉన్నాయి. ఆ కోవలోకే కోనసీమ థగ్స్ మూవీ చేరింది. జైలులోనే కొద్ది మంది పాత్రల చుట్టే ముడిపడి ఉన్న ఈ కథను మంచి ఎంగేజింగ్ గా రూపొందించారు. జైలు నుంచి తప్పించుకునేందుకు హీరో వేసే ఎత్తులు.. అందుకు అవసరమైతే ఎంత దూరమైనా వెళ్లేలా చేసే పరిస్థితులతో ఆద్యంతం ఆసక్తికరంగా కథను తీర్చిదిద్దారు దర్శకురాలు బృందా గోపాల్. ప్రారంభంలో కథ నిదానంగా ఉన్నప్పటికీ.. ప్రేక్షకులకు అర్దం అయ్యేలా కథను మలచడంలో దర్శకురాలు సఫలం అయ్యారు. అయితే శేషు లవ్‌స్టోరీతో పాటు దొర(బాబీ సింహా) ఎందుకు జైలులో పడ్డారో అనే వివరాలు మాత్రమే ఫస్టాఫ్‌లో ఉంటాయి. ఇంటర్వెల్ బ్లాక్ సెకండాఫ్ నుంచి జైలు నుంచి పారిపోవడానికి హీరో చేసే ప్రతి ప్రయత్నం సినిమాటిక్‌గా కాకుండా వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. కామెడీ, రొమాన్స్ ఉన్నప్పటికీ కథను తప్పుదోవ పట్టించకుండా బృందా రాసుకున్న స్క్రీన్‌ప్లే బాగుంది. యాక్షన్స్ సీన్స్ కూడా చాలా రియలిస్ట్‌గా ఉంటాయి. ఈసారి మిస్ అవ్వడు అని తన మీద తానే పంచ్ వేసుకున్న బృంద మాస్టర్.. టార్గెట్ ని బలంగానే కొట్టారని చెప్పాలి
హీరో హ్రిదు హరూన్‌కి ఇది తొలి సినిమా.. అయినా కూడా చాలా చక్కగా నటించాడు. ఎమోషనల్ సీన్స్‌లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు కానీ యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీశాడు. దొర పాత్రలో బాబీ సింహా జీవించేశాడు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొత్తేమి కాదు అని చెప్పాలి. డైలాగ్స్ పెద్దగా లేకున్నా.. బాబీ పాత్ర మాత్రం సినిమాకు ప్లస్ అయింది. ఇక కోయిల పాత్రకు అనస్వర రాజన్ న్యాయం చేసింది. పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఉన్నంతలో చక్కగా నటించింది. దొంగతనం కేసులో జైలుకు వచ్చిన మధుగా మునీష్ కాంత్ తనదైన కామెడీతో నవ్వించాడు. శరత్ అప్పనితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక సాంకేతిక విషయానికొస్తే.. శామ్ సి ఎస్ సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. ప్రీయేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా ప్లస్ అయింది. ఎడిటర్ ప్రవీణ్ ఆంటోనీ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
విజయం సాధించిన ఖైదీలు.. పోరాడిన బృంద మాస్టర్
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/