Atishi Resigns: సీఎం పదవికి ఆతిశీ రాజీనామా.. ఢిల్లీ శాసనసభ రద్దు
![Atishi Resigns: సీఎం పదవికి ఆతిశీ రాజీనామా.. ఢిల్లీ శాసనసభ రద్దు](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-09-at-13.51.32.jpeg)
Atishi Resigns As Delhi Chief Minister: ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, ఢిల్లీ సీఎం ఆతిశీ ఆదివారం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి తన పదవి రాజీనామా లేఖను అందజేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి కాగా, ఈ నేపథ్యంలో ఆమె నిర్ణయం తీసుకున్నారు. కల్కాజీలో బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరిపై ఆతిశీ 3,521 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెల్చుకుని భారీ విజయాన్ని సాధించింది. మరోవైపు ఆప్ కీలక నేతలు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ఓడిపోయారు.
తన పదవిలో..
ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో జైలు శిక్ష అనుభవించి గతేడాది సెప్టెంబర్‌లో బయటకు వచ్చాక సీఎం పదవికి రాజీనామా చేశారు. ప్రజలు మళ్లీ తనను మళ్లీ గెలిపించే వరకూ పదవిలో ఉండనని ముఖ్యమంత్రిగా ఆతిశీని ప్రతిపాదించారు. దీంతో ఆమె అనూహ్యంగా ఆతిశీ సీఎం పదవిని చేపట్టారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, తన ముందున్న కేజ్రీవాల్ ఉపయోగించిన కుర్చీని తన కార్యాలయంలో ఖాళీగా ఉంచారు. కేజ్రీవాల్ కోసం ఈ సీటు ఎప్పటికీ ఉంటుందని ప్రకటించారు. ఆమెను కొంత మంది ‘తాత్కాలిక సీఎం’ అని పిలిచారు. కానీ ఆమె మాత్రం తన పదవిలో చాలా సీరియస్‌గా పనిచేశారు.
అతిషి రాజకీయ ప్రయాణం..
2015లో అప్పటి విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియాకు ఆమె సలహాదారుగా నియమితులయ్యారు. విద్యావ్యవస్థను పునరుద్ధరించడానికి, మౌలిక సదుపాయాలను పెంచేందుకు ఆప్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. దీంతోపాటు ఆమె ఆప్ అధికార ప్రతినిధిగా, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలిగా కూడా పనిచేశారు. 2019లో ఆమె తూర్పు ఢిల్లీ స్థానం నుంచి బీజేపీకి చెందిన గౌతమ్ గంభీర్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విఫలమయ్యారు. కానీ, 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కల్కాజీ అసెంబ్లీ స్థానంలో విజయం సాధించారు. ఆమె కేబినెట్ మంత్రిగా అనేక శాఖలను నిర్వహించారు.
రాజీనామా తర్వాత
ఆతిశీ రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీ అసెంబ్లీ రద్దు అయింది. ఈ పరిణామాలు ఆప్ పార్టీకి ముఖ్యంగా ఆమెకు, రాజకీయంగా పెద్ద దెబ్బగా మారాయని చెప్పవచ్చు. పార్టీకి చెందిన ఇతర నాయకులు కూడా ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణిస్తున్నారు. భవిష్యత్‌లో పార్టీతో ఎలా ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె నాయకత్వంలో పార్టీకి ఎదురైన సవాళ్లను అధిగమించడానికి కొత్త వ్యూహాలు అనుసరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన ఇతర నేతలతోపాటు కేజ్రీవాల్ ఈ పరిస్థితి తర్వాత, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై చర్చనీయాంశంగా మారింది.