Hyderabad local body Elections : ముగిసిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్.. కాంగ్రెస్ ఓట్లు ఎటువైపు?

Hyderabad local body Elections : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నిక పోలింగ్ సజావుగా ముగిసింది. బుధవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 4 గంటలకు ముగిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 81 మంది కార్పొరేటర్లలో 66 మంది కార్పొరేటర్లు, 31 మంది అఫిషియో సభ్యుల్లో 21 మంది ఓటు వేశారు. ఓటింగ్‌లో బీఆర్ఎస్ మినహా బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంఐఎం పార్టీ తరఫున మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి, బీజేపీ నుంచి గౌతమ్‌రావు బరిలో నిలిచారు. ఈ నెల 25న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బీఆర్ఎస్ పార్టీ పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఎన్నిక ఫలితంపై ఉత్కకంఠ నెలకొంది.
క్రాస్ ఓటింగ్‌తో ఎవరికి ముప్పు?
ఎన్నికలో ఎంఐఎం పార్టీ గెలిచే అవకాశం ఉండగా, ఓడిపోతామని తెలిసినా బీజేపీ బరిలోకి దిగడంతో రాజకీయం హీటెక్కింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్‌కు దూరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ పోలింగ్‌లో పాల్గొనడం రాజకీయం మరింత రసకందాయంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎటువైపు అనేది ఆసక్తిగా మారింది. పోలైన మొత్తం ఓట్లలో 50 శాతానికి ఒక్క ఓటు ఎక్కువ ఎవరికి లభిస్తే ఆ అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో 88 ఓట్లు పోలు కాగా, ఇందులో పార్టీల మధ్య క్రాస్ ఓటు జరిగిందా అనేది ఉత్కంఠగా మారింది.