Karregutta : కర్రెగుట్టపై కొనసాగుతున్న భారీ ఆపరేషన్.. కీలక నేతలు దొరికేనా?

కర్రెగుట్టపై కొనసాగుతున్న భారీ ఆపరేషన్.. కీలక నేతలు దొరికేనా?
National flag on Karregutta : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని బీజాపుర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘కర్రెగుట్ట’లో చేపట్టిన భారీ ఆపరేషన్ పదో రోజూ కూడా రోజూ కొనసాతోంది. కొత్తపల్లి నుంచి దాదాపు కిలోమీటర్ల పొడవు, 5 వేల అడుగుల ఎత్తులోని కర్రెగుట్టల కేంద్రంగా ఆపరేషన్ కొనసాగుతోంది. కర్రెగుట్టల కేంద్రంగా మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. ఆపరేషన్‌లో భాగంగా భద్రతా బలగాలు రెండు కొండలను తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి.
దోబే కొండలపై బలగాలు..
కర్రెగుట్టల్లో మావోలు స్థావరాలుగా చేసుకున్నారు. ఈ క్రమంలోనే అడ్కడే మకాం వేసి దోబే కొండలపై వైమానిక దళ హెలికాప్టర్ల సాయంతో బలగాలను దించారు. అంతకుముందు నీలం సరాయ్ కొండను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. భారీ గుహలను గుర్తించారు. కర్రెగుట్టలోని మూడో కొండవైపు చేరుకునేందుకు బలగాలు అడుగులు వేస్తున్నాయి. కర్రెగుట్టలపై తివర్ణ పతాకాన్ని జవాన్లు ఎగరవేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. కొండల్లో మావోలు ఏర్పాటు చేసిన 150కు పైగా ఐఈడీలను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి.
మావోయిస్టుల జాడేదీ?
తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాకు మధ్యలో ఉన్న అడవులను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. మావోల పార్టీ పీఎల్‌జీఏ-1 బెటాలియన్ కీలక నేత హిడ్మా, రాష్ట్ర కమిటీ ఇన్‌చార్జి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ బృందం పాగా వేశారనే సమాచారం. దీంతో నలువైపుల నుంచి 24 వేల మంది బలగాలతో కూంబింగ్ చేపడుతున్నారు. అయినా మావోల జాడ ఇప్పటి వరకు కనిపించలేదు. బలగాల అన్వేషణను ముందస్తుగా పసిగట్టిన మావోల బృందాలు రహస్య స్థావరాలకు చేరుకున్నాయా? కేంద్రం దృష్టిని మళ్లించడానికే కర్రెగుట్టను వీడి మరో ప్రాంతానికి వెళ్లారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
శాంతి చర్చలు ఉండవు : ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి
మావోల పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి ‘అభయ్’ శాంతి చర్చలు జరపాలని కేంద్ర, రాష్ట్ర సర్కార్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో శాంతి చర్చలు ఉండవని ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయశర్మ స్పష్టం చేశారు. మావోలు లొంగిపోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. బస్తర్‌లో హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు శాంతి కమిటీలు ఎక్కడ ఉన్నాయని, నాయకులు, గ్రామస్తులు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని హోంమంత్రి ప్రశ్నించారు.