BRS chief KCR : ఈ నెల 11న బీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశం

BRS chief KCR : ఈ నెల 12 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 27 వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 11వ తేదీన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ నెల 11న మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశంచేయనున్నారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్ వస్తుండటంతో పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపటితో నామినేషన్ గడువుకు ముగియనుంది.
ఎమ్మెల్సీ ఎన్నికలపై కసరత్తు..
ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ 38 స్థానాలు గెలుచుకుంది. ఇందులో 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీ మారారు. ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థానం గెలువాలంటే 21 ఎమ్మెల్యేలు అవసరం. ఈ లెక్కన చూసుకుంటే బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థులను నిలబెడితే మరో నలుగురు ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. రెండో అభ్యర్థిని నిలబెడితే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు విప్‌జారీ చేయవచ్చునని బీఆర్‌ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల నిబంధనలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఏజెంట్‌కు చూపించి ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సిన అవసరం లేనందున ఎలా ముందుకు సాగాలన్న దానిపై వ్యూహాలకు పదును పెడుతున్నట్లు సమాచారం.