Published On:

Heat Wave in Telangana: నిప్పుల కొలిమిలా తెలంగాణ.. 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు

Heat Wave in Telangana: నిప్పుల కొలిమిలా తెలంగాణ.. 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు

Heat Wave in Telangana: తెలంగాణలో భానుడు భగభగమంటున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వారం రోజులు వాతావరణం చల్లగా ఉన్నా సోమవారం నుంచి ఎండలు మండుతున్నాయి. సూర్యుడి ప్రతాపంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లా నిప్పుల కొలిమిగా మారింది. పది జిల్లాల్లో 44 డిగ్రీలపైగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ నిర్మల్‌ జిల్లాలోని కుభీర్‌ మండలంలో నిన్న 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సందర్భంగా ఆయా జిల్లాలకు హైదరాబాద్ వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ కూడా జారీ చేసింది.

 

మరో 23 జిల్లాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు..
తెలంగాణ రాష్ట్రంలో 23 జిల్లాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వాతవారణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఉదయం 10 నుంచి సాయంత్రం నాలుగు వరకు అత్యవసరం అయితేనే బయట తిరుగొద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.

 

నలుగురు మృతి..
ఎండల తీవ్రతతో వడదెబ్బ తగిలి మంగళవారం 4గురు మృతిచెందారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని మల్లవరం గ్రామానికి చెందిన మేడి ఎర్రముత్తయ్య (76) వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై దుర్మరణం చెందారు. పెనుబల్లి మండలం కందిమళ్లవారి బంజర్‌ గ్రామానికి చెందిన వంటల మేస్త్రి తుమ్మలపల్లి సత్యనారాయణ (43) వంట చేసేందుకు వెళ్లి వడదెబ్బ బారిన పడి మృతిచెందాడు.

 

జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం సర్వాపూర్‌ గ్రామానికి చెందిన మర్రిపెల్లి అర్వింద్‌ (19) మామిడి తోటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లి వడదెబ్బకు గురి కాగా, కుటుం సభ్యలు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వల్లంపట్ల గ్రామానికి చెందిన పాత భూమయ్య(58) సైకిల్‌పై తిరుగుతూ చింతగింజలు, చింతపండు, ధాన్యం కొనుగోలుతో జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం సైకిల్‌పై వెళ్తూ వడదెబ్బ తగిలి కింద పడ్డాడు. ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందాడని స్థానికులు తెలిపారు.

 

మరో మూడురోజులు ఎండలే..
తెలంగాణలో మరో 3 రోజులపాటు వడగాలులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు నమోదు అవుతున్నాయని పేర్కొంది. వడగాలుల వల్ల వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్‌, ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. అస్వస్థతకు గురైతే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని తెలిపారు. తరచుగా నీరు, కొబ్బరి నీరు, ఓఆర్‌ఎస్‌ వంటి ద్రావణాలు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: