Deputy CM Bhatti Vikramarka : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ భూ నిర్వాసితులకు ఉద్యోగాలు : డిప్యూటీ సీఎం భట్టి

Deputy CM Bhatti Vikramarka : ప్రత్యేక తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత పోరాటం చేసిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. యువత ఆశలను నెరవేరుస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 53 వేల మందికి నియామకపత్రాలు అందజేశామని తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పరిధిలోని 112 మంది భూ నిర్వాసితులకు టీఎస్ జెన్‌కో ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. శుక్రవారం మాదాపూర్ సైబర్ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నియామక పత్రాలు అందజేశారు. దామచర్ల మండలం వీర్లపాలెంకు చెందిన 112 మందికి జూనియర్ అసిస్టెంట్లు, ప్లాంట్ అటెండర్లు, ఆఫీస్ సబార్డినేట్ల ఉద్యోగాలు కల్పించారు.
గత ప్రభుత్వం మోసం..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇస్తామని గత ప్రభుత్వ నేతలు హామీ ఇచ్చారని, భూ నిర్వాసితులు వృద్ధులైపోయారు కానీ, ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు. తమ హయాంలో భూమి కోల్పోయిన వారికి వెంటనే ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేని వారికి ఉపాధి కల్పించే కార్యక్రమం చేపట్టామన్నారు.
రాజీవ్ యువ వికాసం ద్వారా ఉపాధి..
రాజీవ్ యువ వికాసం ద్వారా యువతకు ఉపాధి కల్పించనున్నట్లు చెప్పారు. పథకానికి రూ.9 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు. రాజీవ్‌గాంధీ సూచన మేరకు హైటెక్ సిటీకి నేదురమల్లి జనార్దన్‌రెడ్డి శంకుస్థాపన చేశారని, రాజీవ్ గాంధీ కృషితో నేడు ఐటీ రంగం ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. ఫ్యూచర్ సిటీలో మరిన్ని కంపెనీలు ఏర్పాటయ్యేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను విస్తరిస్తే.. మరిన్ని పెట్టుబడులు వస్తాయని, ఉపాధి కూడా పెరుగుతుందని భట్టి తెలిపారు.