Operation Garuda : ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే చర్యలు : ఈగల్ చీఫ్ రవికృష్ణ

Operation Garuda : మత్తును కలిగించే డ్రగ్స్ అమ్మకాలపై ఈగల్ విభాగం పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రగ్స్ దుర్వినియోగంపై ఏపీవ్యాప్తంగా ఒకేసారి అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 100 బృందాలతో మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో ఐజీ ఈగల్ టీమ్ తనిఖీలు చేపట్టింది. ఆపరేషన్ గరుడలో భాగంగా ఏపీ డీజీపీ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టారు. ఈగల్ టీమ్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసుల సంయుక్తంగా విజయవాడలోని భవానీపురం, గుణదల ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. సైకోటిక్ మెడిసిన్‌ను వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ హెచ్చరించారు. ఆల్ఫ్రాజోలమ్, ట్రెమడాల్ లాంటి సైకోటిక్ మెడిసిన్‌ను అనధికారికంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు.
తూర్పుగోదావరి జిల్లాలో 16చోట్ల సోదాలు..
డ్రగ్స్ తరహాలో వాడేందుకు కొన్నిరకాల మందులు, ఇంజెక్షన్లు మెడికల్ దుకాణాల నుంచి యువత కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో అధికారులు మెడికల్ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో 16 చోట్ల తనిఖీలు చేపట్టినట్లు విజిలెన్స్ ఎస్పీ స్నేహిత, డ్రగ్స్ ఏడీ నాగమణి తెలిపారు. రాజమండ్రి గణేశ్ చౌక్ వద్ద తిరుమల శ్రీనివాస్ మెడికల్ ఏజెన్సీలో 255 ట్రెమడాల్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ ఏజెన్సీలో, మెడికల్ షాపుల్లో ఇంజెక్షన్లు, మత్తు కలిగించే సిరప్‌లు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.