Last Updated:

Pawan Kalyan Kumbh Mela: ‘కుంభమేళా’ సనాతన ధర్మానికి ప్రతీక.. సీఎం యోగి ప్రభుత్వానికి పవన్ ప్రత్యేక ధన్యవాదాలు

Pawan Kalyan Kumbh Mela: ‘కుంభమేళా’ సనాతన ధర్మానికి ప్రతీక.. సీఎం యోగి ప్రభుత్వానికి పవన్ ప్రత్యేక ధన్యవాదాలు

AP Deputy CM Pawan Kalyan in Maha Kumbh Mela with Family: ప్రయాగ్‌‌రాజ్‌లో వైభవంగా జరుగుతున్న మహాకుంభమేళాకు జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కుటుంబసమేతంగా వెళ్లారు. త్రివేణి సంగమంలో భార్య అన్నా లెజ్నోవా, కుమారుడు అకీరా, డైరెక్టర్ త్రివిక్రమ్‌తో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం పవన్ దంపతులు పవిత్ర సంగమం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పసుపు కుంకుమ, పువ్వులు సమర్పించి హారతి ఇచ్చారు. పితృదేవతలకు తర్పణాలు వదిలి, బ్రాహ్మణులకు వస్త్ర దానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

గొప్ప వరంగా భావిస్తున్నా..
మహాకుంభమేళాలో పాల్గొనడం గొప్పవరంగా భావిస్తున్నానని పవన్ చెప్పారు. ఇన్ని కోట్ల మంది భక్తులు ఒకచోట చేరినప్పుడు చిన్నచిన్న ఘటనలు ఎదురవుతాయని, వాటిని విపక్షాలు రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్న యూపీ సీఎం యోగి అదిత్యనాథ్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడికి రావాలనేది చాలా దశాబ్దాలుగా తనకు అతిపెద్ద కోరిక అన్నారు. ఈ రోజు తనకు ఇక్కడికి వచ్చే అవకాశం వచ్చిందన్నారు. సంస్కృతి, భాషాపరంగా భారతీయులు వేర్వేరు అయినప్పటికీ ధర్మంపరంగా అంతా ఒక్కటేనని పవన్ అన్నారు. దానికి ప్రతిబింబం కుంభమేళా అని తెలిపారు. కుంభమేళాలో పాల్గొనడం తన అదృష్టమన్నారు. అన్నారు.

సనాతన ధర్మంపై వ్యాఖ్యలు సరికావు..
మహా కుంభమేళాపై పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు పవన్ కౌంటర్ ఇచ్చారు. మన నాయకులకు సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేయడం చాలా సులువు అయిపోయిందని మండిపడ్డారు. కోట్ల మంది విశ్వాసాలను దెబ్బతిస్తాయని వారు తెలుసుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులుగా ఈ వేడుక జరుగుతుందని, లక్షలాది ప్రజలు ఓ చోటుకు చేరినప్పుడు కఠిన సవాళ్లు ఎదురవుతాయన్నారు.

కుంభమేళాలో వెంకయ్య నాయుడు పుణ్యస్నానం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మహా కుంభమేళాలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఇందుకు సంబంధిత ఫొటోను ఆయన ఎక్స్‌‌లో పంచుకున్నారు. మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద మత, ఆధ్యాత్మిక వేడుక అన్నారు. సనాతన సంప్రదాయం, వారసత్వానికి ఇదో గొప్ప ప్రతీకగా వెంకయ్య పేర్కొన్నారు. దేశ ప్రజలందరూ ఆరోగ్యంగా, సౌభాగ్యంగా ఉండాలని గంగమ్మతల్లిని ప్రార్థించినట్లు తెలిపారు.